తోట వాణి...చినరాజప్పకు చెక్ పెడతారా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తోట వాణి...చినరాజప్పకు చెక్ పెడతారా

రాజమండ్రి, మే 18, (way2newstv.com)
తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురంలో జ‌రిగిన ఎన్నిక‌లు స‌ర్వత్రా ఆస‌క్తి రేపుతున్నాయి. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఇక‌, వైసీపీ నుంచి తోట వాణి ఇక్కడ నుంచి పోటీ చేశారు. వాస్తవానికి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. కాకినాడ ఎంపీగా తోట న‌ర‌సింహం చ‌క్రం తిప్పారు. టీడీపీలో కీల‌క రోల్ పోషించారు. అయితే, టికెట్ విష‌యంలో త‌లెత్తిన విభేదాల కార‌ణంగా తోట న‌ర‌సింహం టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీకి జై కొట్టారు. ఇక‌, ఈ క్రమంలోనే తాను పోటీ నుంచి త‌ప్పుకొని త‌న స‌తీమ‌ణి వాణికి పెద్దాపురం టికెట్ ఇప్పించుకున్నారు.వాస్తవానికి తోట న‌ర‌సింహం ఈ ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట లేదా పిఠాపురం నుంచి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు అక్కడ సిట్టింగ్‌ల‌ను ప‌క్కన పెట్టి ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయ‌న పార్టీ ఫిరాయించి చివ‌ర‌కు త‌న భార్యకు వైసీపీ త‌ర‌పున పెద్దాపురం సీటు ఇప్పించుకున్నారు. దీంతో పెద్దాపురంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరును ప‌క్కన పెట్టి తోట వాణి వ‌ర్సెస్ చిన‌రాజ‌ప్ప పోరుగా మారిపోయింది. 


తోట వాణి...చినరాజప్పకు చెక్ పెడతారా

దీంతో ఒక‌రిని ఓడించేందుకు మ‌రొక‌రు ఎత్తుల మీద ఎత్తులు వేసుకున్నారు. వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా చిన‌రాజ‌ప్ప‌ను ఓడించేందుకు వాణి స‌ర్వశ‌క్తులూ ఒడ్డారు. టీడీపీని కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన తాము గెలిచి తీరాల‌నే క‌సితో తోట న‌ర‌సింహం కూడా తెర‌చాటు ప్ర‌య‌త్నాలు చాలానే చేశారు.మ‌రోప‌క్క, మంత్రిగా త‌న హ‌వాను తిరిగి నిల‌బెట్టుకునేందుకు చిన‌రాజ‌ప్ప కూడా ఇదే రేంజ్‌లో ప్రయ‌త్నాలు చేశారు. మొత్తంగా పెద్దాపురంలో హోరా హోరీగా సాగిన పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఆస‌క్తిగా మారింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న చిన‌రాజ‌ప్ప 2014 లో మాత్రమే తొలిసారి ఆయ‌న ప్రజాక్షేత్రంలోకి వ‌చ్చారు. ఇక్కడ నుంచి విజ‌యం సాధించ‌డంతో చంద్రబాబు ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించారు. ఇక‌, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా అభివృద్ధిలో దూకుడు చూపించారు. ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌న త‌న అభివృద్ధి పంథానే ఎంచుకున్నారు. వాణి కూడా సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న కుటుంబం నుంచే వ‌చ్చారు. మెట్ల స‌త్యనారాయ‌ణ కుమార్తెగా ఆమె గుర్తింపు సాధించారు. ఇక‌, భ‌ర్త తోట న‌ర‌సింహం కూడా ఎంపీగా చ‌క్రం తిప్పారు. ఇక‌, చిన‌రాజ‌ప్ప, వాణి కుటుంబాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఆది నుంచి కొన‌సాగింది.ఎన్నిక‌ల‌కు ముందు మెట్ల స‌త్యనారాయ‌ణ‌పై చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్యల‌తో ఆయ‌న కుమార్తె వాణి ప‌గ పెంచుకున్నారు. త‌న తండ్రిని దూషించిన చిన‌రాజ‌ప్పను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆమె ఎన్నిక‌ల్లో దూకుడు పెంచారు. త‌న రాజకీయ జీవితంలో ఇద్దరే త‌న‌కు శ‌త్రువులు ఉన్నారంటూ వారిలో ఒక‌రు ఇప్పుడు ఉన్నాడు… ఇంకొక‌డు పోయాడ‌ని రాజ‌ప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తోట వాణి చిన‌రాజ‌ప్ప మీద స‌వాల్ చేసి మ‌రీ పోటీకి దిగారు. ఈ క్రమంలోనే ఆమె ప్రచారాన్ని జోరు పెంచారు. కాపు, బీసీ ఓట్లు కూడా ఇక్కడ కీల‌కంగా మార‌డంతో ఎవ‌రు ఏ ప‌క్షాన నిలుస్తార‌నేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దాపురం, సామ‌ర్లకోట మునిసిపాలిటీలు, రెండు మండ‌లాలు మాత్రమే ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మల ప్రాబ‌ల్యం కూడా ఎక్కువే. వీరంతా టీడీపీ వైపే ఉంటారు. ఇక రాజ‌ప్పకు బొడ్డు భాస్కర‌రామారావు వ‌ర్గం స‌హ‌క‌రించ‌క‌పోయినా ఆయ‌న హ‌వా ఇప్పుడు లేద‌ని రాజ‌ప్ప వ‌ర్గం చెపుతోంది. ఇక్కడ జ‌న‌సేన కూడా అభ్యర్థిని నిల‌బెట్టినా.. ప్రధాన పోరు మాత్రం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న రేంజ్‌లోనే సాగింది. మ‌రి తోట వాణి త‌న ప‌గ తీర్చుకుని మంత్రిని ఓడిస్తుందా? లేదా? అనే విష‌యం ఈ నెల 23 వ‌ర‌కు వెయిట్ చేస్తేనే గానీ తెలియ‌దు.!