సిక్కోలులోక్షణక్షణం తీవ్ర ఉత్కంఠ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలులోక్షణక్షణం తీవ్ర ఉత్కంఠ


శ్రీకాకుళం, మే 24   (way2newstv.com)
తీవ్ర ఉత్కంఠ మధ్య శ్రీకాకుళం పార్లమెంటు ఎన్నిక తుది ఫలితం ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉదయం మొదలైన లెక్కింపు ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజాము వరకూ కొనసాగింది. క్షణక్షణం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ స్థానంలో లెక్కింపు ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యాహ్నం వరకూ వెనుకంజలో ఉన్న టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు అనూహ్యంగా ఆధిక్యతలోకి వచ్చారు. ఈవీఎంలలో అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 8,222 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. అదే సమయంలో 7వేలు సర్వీసు ఓట్లు, 14వేలు పోస్టల్ బ్యాలెట్లు మిగిలి ఉండడంతో ఉత్కంఠ పెరిగింది. సిక్కోలులోక్షణక్షణం తీవ్ర ఉత్కంఠ
కానీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనర్హత ఓట్లను అధికారులు తొలగించారు. దీనిపై వైసీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటన్నింటినీ లెక్కించాలని కోరారు. అర్ధరాత్రి వరకూ తుది ఫలితం రాలేదు. ఒకదశలో లోపల వారిని బయటికి రానీయకుండా... బయటవారిని లోపలికి వెళ్లకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టం చేశారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 12గంటలకు పూర్తికాగా, రామ్మోహన్ నాయుడు 6808 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే, వైసీపీ అభ్యర్థి పలు అభ్యర్థనలు లేవనెత్తడంతో అధికారికంగా ఫలితాన్ని ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. డిక్లరేషన్ పత్రంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంతకం చేయడానికి నిరాకరించినట్టు సమాచారం. అయితే, ఈసీ సూచనలతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే, టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ అభ్యర్థి దువ్వాడ ఆరోపించారు. ఈ విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.