అనంతపురం, మే 13, (way2newstv.com)
ఎన్నికలు, రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటు అన్నీ కూడా సెంటిమెంట్‌తోనే నడుస్తుంటాయి. ముఖ్యంగా రాజకీయ నేతల కు సెంటిమెంట్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించే వరకు కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఒకటి టీడీపీలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ పోటీ చేశారు. అయితే, ఈయనకు-టీడీపీ ప్రభుత్వానికి మధ్య గట్టి సెంటిమెంట్ ఉంది. కేశవ్ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలిచిన ప్రతిసారీ.. టీడీపీ అధికారానికి దూరమవుతోంది.ఇక, కేశవ్ ఇదే నియోజకవర్గం నుంచి ఓడిన ప్రతిసారీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 1994లో ఉరవకొండ నియో జకవర్గం నుంచి తొలిసారి పయ్యావుల కేశవ్ టీడీపీ జెండా పై విజయం సాధించారు.
పయ్యావుల కు బ్యాడ్ సెంటిమెంట్
అయితే, ఆ దఫా ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలో అందరూ గెలిచారు… వారిలో కేశవ్ కూడా ఒకరు. ఇక 1999 నుంచి ఉరవకొండను బ్యాడ్ సెంటిమెంట్ పట్టుకుంది. ఈ సెంటిమెంట్‌కు కేశవ్ బలవుతూ వస్తున్నారు. 1999లో ఏపీలో మరోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఉరవకొండలో మాత్రం కేశవ్ ఓడిపోయారు. ఇక, 2004, 2009 ఎన్నికల్లో నూ ఇదే సీన్ రిపీట్ అయింది. పయ్యావుల ఈ రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. కానీ, పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక గత ఎన్నికల్లో ఏపీ విభజనకు గురయ్యాక నవ్యాంధ్రలో చంద్రబాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ జరగడంతో పయ్యావులపై సెంటిమెంట్ పవనాలు కూడా వీస్తున్నాయి.ఇక, చిత్రమైన విషయం ఏంటంటే.. అసలు ఈ నియోజకవర్గంలో గడిచిన నాలుగు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి విజయం సాధిస్తున్న అభ్యర్థికి చెందిన పార్టీ అధికారానికి దూరమవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చాటుతున్నాయి. అయితే, అధికారానికి కొద్ది తేడాతో దూరమైంది. ఇక, ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వై. విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసి విజయంసాధించారు. ఆయన ఇక్కడ గెలిచారు.. అధికారంలోకి వస్తుందనుకున్న వైసీపీకి ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి. దీంతో అటు టీడీపీలోను, ఇటు వైసీపీలోను కూడా ఈ నియోజకవర్గం గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున సెంటిమెంట్ పవనాలు వీస్తుండడం గమనార్హం. అదే టైంలో స్టేట్‌లో గెలిచిన పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోవడంతో ఉరవకొండ గత రెండేళ్లలో బాగా వెనకపడిపోయిందన్న టాక్ కూడా ఉంది. మరి ఈ సారి కేశవ్ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా ? లేదా ఆయన గెలిచి… ఏపీలో పార్టీ ఓడడం లేదా… ఏపీలో పార్టీ గెలిచి… ఇక్కడ ఆయన ఓడడం జరుగుతుందా ? అన్నది 23న తేలిపోనుంది.