పార్టీలో జోరుగా శిబిర రాజకీయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీలో జోరుగా శిబిర రాజకీయాలు

గుంటూరు, మే 6, (way2newstv.com)
రాష్ట్రంలో హంగ్ తీర్పు వెలువడితే ఏంచేయాలనే అంశంపై ప్రధాన పార్టీలు అప్పుడే దృష్టి సారించాయి. ప్రత్యేక శిబిరాలు తెరవడం సహా ఎవరిని ఎలా తమవైపు ఆకట్టుకోవాలనే అంశంపై వర్గాలు, కులాలు, ప్రాంతాలవారీగా కసరత్తు మొదలైంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడికీ సిద్ధమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల్లో కాన్ఫిడెన్సు లోపించడమే. ఒకవైపు ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ వెన్నాడుతోంది. మరోవైపు వందలకోట్లలో బెట్టింగులు. ఇంకో వైపు కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరనే చర్చలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరాలు తెగేంత ఉత్కంఠ, ఉద్విగ్నత. పైకి తమదే విజయమంటూ ధీరగంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలోపల బితుకుబితుకు మంటూ భయం. మూలమూలల్లో సందేహం. సర్వేలను నమ్ముకునేవారు కొందరు. జాతకులను ఆశ్రయించేవారు మరికొందరు. పంచాంగ గణనలతో అనుగ్రహాలను పరిగణించుకునేవారు ఇంకొందరు. మరో 20 రోజులు ఈ తిప్పలు తప్పవు. స్పష్టమైన ఆధిక్యంతో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే సరి. లేకుంటే తలపోటే. క్షణమొకయుగంగా గడుపుతున్న నాయకులకు అసలు పరీక్ష అప్పుడు మొదలవుతుంది. 


పార్టీలో జోరుగా శిబిర రాజకీయాలు

త్రిశంకు స్వర్గం లాంటి సభే ఏర్పాటైతే రాజకీయాల రంగు,రుచి,వాసన మారిపోతాయి. గోడమీద పిల్లులే రాజకీయ పార్టీలకు గోల్ అవుతారు. ఒక ఎమ్మెల్యే స్థానానికి 20 నుంచి 30 కోట్లు ఖర్చుపెట్టిన ప్రతినిధుల నుంచి కాసింత విలువలు ఆశించడం అత్యాశే అవుతుంది.బ్యాంకుల్లో సొమ్ము చూపిస్తేనే టిక్కెట్లు ఇస్తామని చెప్పిన పార్టీలు, ఏం చేస్తారో తెలియదు పవర్ లో ఉన్నప్పుడు బాగానే సంపాదించారు కదా.. కనీసం పాతిక కోట్లయినా ఖర్చు పెట్టాల్సిందే అని హుకుం జారీ చేసిన అధిష్ఠానాలు జంప్ జిలానీలను ప్రశ్నించే నైతికతను ఏనాడో కోల్పోయాయి. అందుకే పార్టీలు మళ్లీ వేల కోట్ల రూపాయలు సిద్దం చేసుకోవాల్సిన దురవస్థ. ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. పవర్ ఊరకనే రాదు అన్న పవర్ పుల్ సిద్ధాంతాన్ని అందరూ జీర్ణించుకున్నారు. తాము ఖర్చు పెట్టిన సొమ్మును అయిదేళ్ల కాలవ్యవధిలో రెట్టింపు తిరిగి సంపాదించుకోవాలి. అదే త్రిశంకుసభ ఏర్పడితే రెండుమూడు రెట్లు ఒక్కసారిగా తెచ్చుకోగలిగితే అంతకుమించిన అదృష్టం ఏముంటుంది? దానిని డిమాండు చేసి మరీ ప్రతినిధులు తీసుకుంటారు. అందుకే రెండు విధాలుగా సొమ్ములు వెదజల్లాల్సిందేనని గట్టిగానే నిర్ణయించుకుంటున్నాయి పార్టీలు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కోట్లు కుమ్మరించాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడానికీ పైసలు వెదజల్లాలి. అసలు ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవడానికీ కాసులు కుమ్మరించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హాట్ హాట్ గా ఉంది. వాతావరణమే కాదు, రాజకీయమూ రగిలిపోతోంది. ఎన్నికలు అయిపోయాయి. నేతలు చల్లారుతారు కదా..కాసింత ప్రశాంతత ఏర్పడుతుందనుకునేవారికి ఆశాభంగమే. ప్రధానంగా ముక్కోణ పోటీలో అధికారపు త్రాసు ఎటుమొగ్గిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.గడచిన 20 రోజుల్లోనూ 50 సర్వేలు అనధికారికంగా బయటికి వచ్చాయి. అందులో డజను వరకూ పెద్ద సంస్థలు చేపట్టిన సర్వేలూ ఉన్నాయి. ఇందులో ఎగ్జిట్ పోల్స్ కూడా దాగి ఉన్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనలు తమదే అధికారం అని ఎంత గట్టిగా ఢంకా బజాయిస్తున్నాయో అంతకంటే రెండింతల సౌండ్ తో తమ సర్వేనే వందశాతం పర్ఫెక్ట్ అని సర్వేక్షకులూ చెప్పుకొస్తున్నారు. పైపెచ్చు కరెక్టు కాకపోతే తమ కంపెనీనే మూసేస్తామంటూ సవాల్ విసురుతున్నారు. రెండు పార్టీలే పోటీలో ఉంటూ ముఖాముఖి తలపడితే అటో ఇటో తేల్చిచెప్పేయవచ్చు. కానీ మూడోవాడు ముచ్చటగా రంగంలో ఉన్నాడు. ఇప్పుడదే పజిల్. ఎవరి ఓట్లకు చిల్లు పడింది. కింగ్ మేకర్ గా మూడో పార్టీ రూపుదాలుస్తుందా? సవాలక్ష సందేహాలు, అనుమానాలు. ఈ నేపథ్యంలోనే తమ వాళ్లను కాపాడుకోవడానికి జిల్లాల వారీ నేతలకు బాధ్యతలు అప్పగించేస్తున్నాయి పార్టీలు. ఎదుటి పార్టీ వాళ్లకు గాలం వేసే బాధ్యతలనూ కొందరు పెద్దలకు కట్టబెడుతున్నారు. నిరంతరం వారితో టచ్ లో ఉంటూ పరిస్థితిని మదింపు చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే వీరి పని. సర్వేలలో స్పాన్సర్డ్ సర్వేలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు తెలుగుదేశానికి, ఇటు వైసీపీకి అనుకూలంగా వండి వార్చిన గణాంకాలే రెండు పార్టీలను మురిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను మభ్యపెట్టడానికి, పార్టీక్యాడర్ నైతిక స్థైర్యాన్ని కాపాడుకోవడానికి సర్వేలు బాగానే ఉపకరిస్తాయి. అయితే చేయించుకున్నవారి గుండెల్లో మాత్రం గుబులు రగులుతూనే ఉంది.అన్నిటికంటే ముఖ్యంగా సొంతపార్టీ ప్రతినిధులను కాపాడుకోవడానికి ఈసారి శిబిర రాజకీయాలకూ తెర తీయబోతున్నారు. ఎందుకంటే ఎవరిమీదా ఎవరికీ నమ్మకం లేదు. తమ పార్టీ ప్రణాళికలు, పథకాలు, ప్రజల మీద నమ్మకం లేకపోబట్టే కదా పైసలిచ్చి ఓట్లు కొనుక్కున్నది. ఇక ప్రతినిధులను ఎలా విశ్వసిస్తారు? వారి సొమ్ము వాళ్లకూ గిట్టుబాటు కావాలి కదా.. అందులోనూ అధికారంలో భాగస్వామి అంటే చూస్తూ ఎవరూ వదులుకోలేరు. అందుకే ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. రెండేసి వేలు ఇచ్చి ఓట్లు కొనాల్సి వస్తుందని వాపోయిన నేతలు తమకు ఎంత రేటు పలుకుతుందో లెక్కించుకోకుండా ఉండరు కదా.. త్రిశంకు స్వర్గమే ఎదురైతే శిబిరాలే ఈసారి శరణ్యమనిపిస్తున్నాయి. ప్రలోభాలుంటాయి జాగ్రత్త..అంటూ ఒక అగ్రనేత ఇప్పటికే హెచ్చరించారు. మనవాళ్లు పదిలమేనా? అంటూ మరో అగ్రనేత పరిశీలించుకుంటున్నాడు. ఏదేమైనా అసెంబ్లీ మెజార్టీ మార్కులో ఏమాత్రం తేడా కొట్టినా ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. డెమొక్రసీకి డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. నాయకులు ఈసారి జిల్లాల వారీగా శిబిరాలు పెట్టే యోచనలో ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, పార్టీకి విశ్వాసపాత్రులు వీటి నిర్వహణ బాధ్యతలు చూసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి