అమరావతి, మే 13 (way2newstv.com)
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా వైసీపీ బుకాయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు ఇదే తరహాలో నాటకాలు ఆడారని అన్నారు.
టీడీపీ గెలుపు లాంఛనమే
టీడీపీ గెలుపు లాంఛనమేనని అన్నారు. నంద్యాల, కర్నూలు లోక్ సభ సీట్లలో టీడీపీ గెలుపు తథ్యమనీ, సంస్థాగతంగా బలంగా ఉండటం పార్టీకి కలసి వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, 4 లక్షల సేవా మిత్రలు, 45,000 మంది బూత్ కన్వీనర్లు, 5 వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారని చెప్పారు. వీరంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. టీడీపీ గెలుస్తుందని అన్ని సర్వేలు, విశ్లేషణలు తేల్చిచెప్పాయన్నారు. ఏపీలో ఒక్క మహిళలకే రూ.లక్ష కోట్ల సంక్షేమ ఫలాలు అందజేశామని గుర్తు చేసారు. విద్వేష భావాలు పెంచడమే మోదీ రాజకీయం అ ని దుమ్మెత్తిపోశారు. విభజించి పాలించడమే బీజేపీ వ్యూహం అనిఅన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత విఫల ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలారని చంద్రబబు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గోన్నారు.