బాలికలదే పై చెయ్యి
హైదరాబాద్, మే 13, (way2newstv.com)
తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. సోమవారం పది ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. బాలికలు 93.68శాతంతో పై చేయి సాధించగా బాలురు 91.18 శాతం ద్వితియ స్థానంలో నిలిచారు. ఈసారి ఫలితాల్లో జగిత్యాల నంబర్ వన్ స్థానంలో నిలవగా హైదరాబాద్ చివరిస్థానంలో నిలిచింది. 99.73 శాతంతో జగిత్యాల, 83.09 శాతంతో హైదరాబాద్ నిలిచాయి.
తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంటర్ ఫలితాల గందరగోళం నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి మార్కులను ఒకటికి రెండుసార్లు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలని డైరెక్టర్ సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల్లో ఏవైనా తప్పులు, సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకుగానూ ప్రత్యేకంగా టీఎస్ఎస్సీబోర్డ్ యాప్ను రూపొందించారు. యాప్ను ప్లేస్టోర్ లేదా బీఎసీఈ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించి సమాచారం అందిస్తారు. ఈ యాప్ ద్వారా ఒక్కో విద్యార్థి ఒక్కసారి మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.జూన్ 10 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు- మే 27వరకు ఉంటుంది.