ప్రైవేట్ కు కర్నూలు ఆస్పత్రి సేవలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేట్ కు కర్నూలు ఆస్పత్రి సేవలు


కర్నూలు, మే 24, (way2newstv.com)
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్‌ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్‌ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్‌ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్‌ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు.


ప్రైవేట్ కు కర్నూలు ఆస్పత్రి సేవలు
దీంతో ప్రస్తుతం జనరిక్‌ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్‌ మందుల దుకాణాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్‌ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌  ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్‌ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్‌ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ‘హార్ట్‌ ఫౌండేషన్‌’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్‌ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.