ఆదిలాబాద్, మే 13 (way2newstv.com):
పట్టణంలో నీటి లెక్కను తేల్చేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అందించిన నల్లాలకు నీటి మీటర్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలివిడతగా పట్టణ శివారులో రెండు కాలనీలు, మధ్యలో ఓ కాలనీని పరిగణనలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రెండు నెలల్లో పట్టణంలో అన్ని చోట్ల దీన్ని పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పట్టణంలో చేపడుతున్న మిషన్ భగీరథ పథకానికి అమృత్ నిధులను కేటాయించారు. సుమారు రూ.82కోట్లు పట్టణంలో తాగునీటి వనరులను బాగు చేసేందుకు కేటాయించారు. ఇందులో భాగంగా భగీరథ పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. ఇప్పటికే పైప్‌లైన్ నిర్మాణం 90శాతం వరకు పూర్తిచేసిన అధికారులు ఇంటింటికి నల్లాల బిగింపు కూడా చేపట్టారు. కాలనీల్లో పైప్‌లైన్ పనులతో పాటు ఇంటింటికి నల్లాల బిగింపు కూడా జరుగుతోంది. ఈ ప్రక్రియ దాదాపు ఓ కొలిక్కిరావడంతో నల్లాలకు నీటి మీటర్లను బిగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని శివారు కాలనీలు రణదివెనగర్, గాంధీనగర్ కాలనీలతోపాటు పట్టణం మధ్యలో ఉన్న ద్వారకానగర్ కాలనీల్లో చేపడుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా సామగ్రిని తెప్పించడంతోపాటు కూలీలను కూడా సమకూరుస్తున్నారు.
చుక్క చుక్కకూ లెక్క.. (ఆదిలాబాద్)
రెండు రోజుల క్రితం నుంచి ప్రారంభించిన ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ఎండల ప్రభావంతో పనుల్లో వేగం మందగించినా.. కూలీల సంఖ్యను పెంచి పనులు ముమ్మరమయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం ఒక్కో బృందం రోజుకు 40 వరకు మీటర్లను బిగిస్తున్నారు. కానీ రోజుకు సుమారు 800 మీటర్ల వరకు వీటిని చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే మరో 15 బృందాలను తీసుకొచ్చి అన్ని కాలనీల్లో ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జూలై నెలకల్లా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే రణదివెనగర్, ఖుర్షిద్‌నగర్, వరలక్ష్మీ నగర్, గాంధీనగర్, సంజయ్‌నగర్ తదితర కాలనీల్లో భగీరథ పనులు పూర్తిచేసి నీటి సరఫరా చేపట్టారు. కానీ ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవడంతో రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి పూర్తికాగానే రోజూ నీటిని అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పట్టణ పరిధిలో ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్లను అందించేందుకు సిద్ధమవుతున్నారు.పట్టణంలో ప్రస్తుతం నీటి సరఫరా రోజు తప్పించి రోజు పంపిణీ చేస్తున్నారు. విచ్చలవిడి లీకేజీల కారణంగా చాలా తాగునీరు వృథా అవుతోంది. కొన్ని సందర్భాల్లో శివారు కాలనీల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవిలో మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ట్యాంకుల ద్వారా ఎంత నీరు సరఫరా అవుతుంది.. నల్లాలకు ఎంత చేరుతుంది. మధ్యలో ఎంత నీరు వృథాగా పోతుందో తెలియదు. చాలా లీకేజీలు ఉండటంతో పట్టణానికి సరఫరాఅయ్యే మొత్తం నీరు జనానికి చేరడం లేదు. తాజాగా అమర్చుతున్న నీటి మీటర్లతో లెక్క తేలిపోనుంది. మిషన్ భగీరథ నుంచి రోజూ ఎంత నీరు సరఫరా అవుతుంది. ట్యాంకులకు ఎంతనీరు చేరుతుంది.. అక్కడ్నుంచి ఇంటి నల్లాకు ఎంత వెళ్తుందో ఈ మీటర్ల ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంటిలో వాడిన నీటికి లెక్క తెలుస్తుంది. రోజూ ఎంత వినియోగించామో స్పష్టంగా ఏర్పడుతుంది. ఈ మీటర్ల బిగింపుతో నీటి వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.