భద్రాచలంలో లో వోల్టేజ్ సమస్య - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భద్రాచలంలో లో వోల్టేజ్ సమస్య

ఖమ్మం, మే 4, (way2newstv.com)
భద్రాచలం పుణ్యక్షేత్రంలో విద్యుత్ తిప్పలు వినియోగదారులకు తప్పడంలేదు.భద్రాచలం పుణ్యక్షేత్రంలో లోఓల్టేజ్ సమస్య వినియోగదారులను నిత్యం వేధిస్తూనే ఉంది. పలు కాలనీల్లో లో ఓల్టేజ్‌తో కనీసం ఫ్యాన్లు కూడా తిరిగని పరిస్థితి దాపురించింది. సింగిల్‌ఫేస్‌తో ఈ సమస్య నెలకొంటోంది. త్రీఫేజ్ చేయాలని వినియోగదారులు కోరుతున్నా స్థానిక విద్యుత్‌శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తరచుగా విద్యుత్ అప్‌డౌన్ అవుతూ ఇంట్లో పరికరాలు కాలిపోతున్నాయి. పట్టణంలోని కొన్ని కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో అక్కడ విద్యుత్ వినియోగదారులు కర్రలు, ఐరన్ ఫోల్స్ ద్వారా సర్వీస్ వైర్లను లాక్కోవాల్సిన పరిస్థితి దాపరించింది. సాక్షాత్తు ఐటీడీఏ కార్యాలయం ముందు ఉన్న వైఎస్‌ఆర్ కాలనీలో ప్రజలు కర్రలు, ఇనుపరాడ్లను ఉపయోగించుకొని సర్వీస్ వైర్లను లాగడం గమనార్హం. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఇండ్లపై నుంచే విద్యుత్ సరఫరా వైర్లు ఉన్నాయి. 


భద్రాచలంలో  లో వోల్టేజ్ సమస్య

ఇవి ఇండ్లకు ఆనుకొని ఉండటంతో ఏ సమయంలో ఏప్రమాదం పొంచి ఉందోనన్న ఆందోళనతో ప్రజలు కాలం గడుపుతున్నారు. ఇటీవల పట్టణంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలో ఇండ్లపై ఉన్న విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపోయి పరిసర ప్రాంతంలో పడ్డాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు.  ఓవైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ప్రజలకు అందించాలనే తపనతో ఎంతో కృషి చేస్తుంటే ఇక్కడి స్థానిక అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. గాలి వీస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇక ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి దాపురించింది. బుధవారం సాయంత్రం విపరీతమైన గాలిదుమారంతో వర్షం పడటంతో పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి విద్యుత్ పునరుద్ధరణ చేయాల్సి ఉండగా ఈ విషయంలో విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో బుధవారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి 6 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతంలోని స్థానికులు ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ గురువారం రాత్రి 7 గంటల వరకు కూడా ఏ అధికారి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన దాఖలాలు లేవు. చివరికి రాత్రి 7 గంటల తరువాత కొంతమంది సిబ్బంది ఈ ప్రాంతానికి విద్యుత్ స్తంభాలు సరిచేసే ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే చీకటి కావడంతో సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో 24గంటలు దాటినా పుణ్యక్షేత్రంలోని కూనవరం రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ప్రజల ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఈ ప్రాంతంలో హాస్టల్స్, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో పనులన్ని స్తంభించిపోయాయి. ఆర్‌టీఏ కార్యాలయంలో 24 గంటల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పటికి ఏమాత్రం పట్టించుకోలేదని కూనవరం రోడ్డు, సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సమీపంలోని ప్రజలు వాపోయారు. అత్యవసర పరిస్థితుల్లో తామే పడిపోయిన విద్యుత్ వైర్లను పక్కకు తొలగించామని పేర్కొన్నారు. పట్టణంలోని ఇతర కాలనీల్లో కూడా బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు కునుకు తీయని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న చెట్ల కొమ్మలను ముందస్తుగానే తొలగించాల్సి ఉండగా, ఆ విషయంలో కూడా సంబంధిత సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహించడం మూలంగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.