గొంతెండుతోంది (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గొంతెండుతోంది (పశ్చిమగోదావరి)

ఏలూరు, మే 21 (way2newstv.com): 
జిల్లా వాసులు తాగునీటికి గడ్డు పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఓ పక్క భానుడి ప్రతాపంతో రోజురోజుకు పెరుగుతున్న ఎండలను తట్టుకోలేకపోతున్నారు. దాహార్తితో గొంతు తడారిపోతోంది. గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. మంచినీటి చెరువులు అడుగంటి.. పసర్లు తేలి... కలుషితమై దుర్వాసన వస్తున్న నీటినే పట్టుకోవాల్సిన దైన్య పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంది. పల్లెలతోపాటు పట్టణాల్లో ఇవే కష్టాలు కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాలకు కుళాయిల ద్వారా చుక్కనీరు అందడంలేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకునేందుకు మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం. జిల్లాలోని అయిదు పట్టణాలు.. 443 గ్రామాల్లోని మంచినీటి చెరువులకు కాలువల నీరే ఆధారం. వీటిని పూర్తిస్థాయిలో నీటితో నింపితే గ్రామాల్లో అయితే 30 రోజుల వరకు, పట్టణాల్లో అయితే 40 - 50 రోజుల వరకు ప్రజల అవసరాలు తీర్చొచ్ఛు పంట కాలువలకు అధికారికంగా నీటి సరఫరా నిలిపివేసి పదిహేడు రోజులైంది. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటే దశకు చేరుతున్నాయి. 


గొంతెండుతోంది (పశ్చిమగోదావరి)

అధిక రోజులు నీరు నిల్వ ఉండటంతో పసర్లు పట్టి కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. ఆ నీటినే కుళాయిలకు సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చెరువులకు కొత్తనీరు వచ్చే వరకు ఉన్న నీటినే సర్దుబాటు చేసుకోవాలంటే చాలా కష్టమే.పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏలూరునగరంతో పాటు పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం పట్టణాలకు భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నా నీటి ఇబ్బందులు తప్పడం లేదు. మిగిలిన పట్టణాలు కాలువల నీటిపైనే ఆధారపడ్డాయి. దీంతో అక్కడ పరిస్థితులు మరింత విషమంగా కనిపిస్తుంటాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఠారెత్తిస్తుండటంతో దాహార్తి పెరిగిపోయింది. అయిదు నిముషాలకోసారి గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. దీంతో మంచినీటి వినియోగం బాగా పెరిగిపోయింది. కొన్నిచోట్ల దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నా మరికొన్నిచోట్ల అవీ కనిపించడంలేదు. ఇటువంటి తరుణంలో పట్టణాల్లో కుళాయిల ద్వారా రోజువారీ సరఫరా జరిగే మంచినీటికి ఇబ్బందులు అధికమవుతున్నాయి. అన్నిచోట్ల సరిపడా తాగునీరు అందడంలేదని గగ్గోలు పెడుతున్నారు. కొన్ని పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగడంలేదనే ఆరోపణలున్నాయి.గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రస్తుత మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతూ అడుగంటే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని చెరువులైతే పూర్తిగా పసర్లతో నిండిపోయాయి. ఈ నీటిని చూస్తే మనం తాగే నీరు ఇదేనా అనే భయమేస్తుంది. దీంతో అన్ని గ్రామాల్లోను తాగునీటి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాదాపు అన్నిచోట్ల ప్రస్తుత సరఫరా జరిగే నీటిని వాడకానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. తాగడానికి మాత్రం కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పట్టణ సమీప గ్రామవాసులైతే అయిదు పది కిలోమీటర్లు దూరం వరకు వచ్చి డబ్బాల ద్వారా నీటిని తీసుకెళ్లుతున్నారు. పాలకొల్లు, మొగల్తూరు, నరసాపురం, యలమంచిలి, ఉండి, ఆకివీడు, వీరవాసరం, ఆచంట, పెనుగొండ, తణుకు, అత్తిలి, పెరవలి, భీమవరం, పోడూరు, పెనుమంట్ర తదితర అన్ని మండలాల్లో తాగునీటికి విషమ పరిస్థితులు పొంచి ఉన్నాయి. మరో పది రోజుల్లో అన్ని చెరువుల్లోను పూర్తిగా నీరు అడుగంటి కుళాయిల ద్వారా తాగునీటిని అందించలేని పరిస్థితులు ఎదురుకానున్నాయని అధికార యంత్రాంగం సైతం ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.