రాహుల్ కు ప్రియాంకే... ఇబ్బందా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాహుల్ కు ప్రియాంకే... ఇబ్బందా

న్యూఢిల్లీ, మే 13, (way2newstv.com)
అదే రూపు.. అదే చూపు..అచ్చం నానమ్మలాగే ఉంది..అలాగే మాట్టాడుతోంది.. కార్యకర్తలతో, ప్రజలతో కలిసిమెలిసి పోతోంది..ప్రియాంకను చూసి ఇప్పుడు కాంగ్రెసు శ్రేణులు ఇందిరతో పోల్చుకుని మురిసిపోతున్నారు..కేవలం హావభావాలు, ఆహార్యం, కట్టుబొట్టు…హస్తం పార్టీకి అచ్చివస్తాయా? ఈ వారసత్వాలు నాయకసామర్ధ్యానికి రాణింపు తెస్తాయా? ఇప్పటికే కాంగ్రెసుకు వారసునిగా రాహుల్ గుర్తింపు పొందారు. మరి ఇందిరమ్మ రూపంతో ముందుకొచ్చిన ప్రియాంక రాహుల్ స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తుందా? కాంగ్రెసుకు దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుందా? ఆమెను పెద్ద ఎత్తున పోకస్ చేస్తూ కాంగ్రెసు పార్టీ ప్రచారం చేస్తున్నప్పటికీ ఉత్తరాదికే పరిమితం చేయడంలో ఆంతర్యమేమిటన్న విషయంపైనా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పాత తరానికి ఇందిరమ్మగుర్తులు ఇంకా చెరిగిపోలేదు. పేదల అమ్మగా ఆమెది చెరగని ముద్ర. గరీబీహఠావో…నినాదకర్త. రాజభరణాల రద్దు, బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా దేశంలో పెనుమార్పులకే శ్రీకారం చుట్టారు. పేదలకు సంబంధించిన పథకాలను అమల్లోకి తెచ్చి ఎస్సీ సామాజికవర్గాలను , పేదలను కాంగ్రెసుకు పెట్టని కోటగా, ఓటు బ్యాంకుగా మార్చారు. అయితే వివిధ సామాజిక సమీకరణలతో ఆ ఓటు బ్యాంకు చెల్లాచెదురైపోయింది. 


రాహుల్ కు ప్రియాంకే... ఇబ్బందా

అయితే ఇందిరమ్మ హావభావాలు, రూపం, ప్రవర్తించే తీరు ఇంకా ఓ తరంలో మిగిలే ఉన్నాయి. గ్లామరస్ పొలిటీషియన్ గా ప్రియాంక. ఆమెను కాంగ్రెసు శ్రేణుల్లోకి, ప్రజల్లోకి పంపడం ద్వారా యువతలో ఆశలు చిగురింప చేయవచ్చు. అదే సమయంలో పాత తరంతో, పేదలతో తిరిగి కనెక్టు కావచ్చు. ఇలా రెండు రకాల లక్ష్యాలతో ప్రియాంకకు కాంగ్రెసు ప్రయారిటీ పెంచింది. ఇందిర తరహాలోనే కనిపిస్తోందంటూ పెద్ద ఎత్తున బ్రాండింగు చేసేందుకు సొంతంగా పార్టీ అంతర్గత విభాగాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఎలాగూ ఆ రూపురేఖలున్నాయి కాబట్టి సహజంగానే ప్రజాదరణను చూరగొంటోంది ప్రియాంక..దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పట్టు సాధించకపోతే కాంగ్రెసు కేంద్రంలో అధికారం చేపట్టడం అంత సులభం కాదు. ఒకవేళ చేపట్టినా దేశంలోని చిన్నాచితక పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. దేశానికి అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రులను అందించిన ఈ రాష్ట్రం నుంచే కాంగ్రెసు పునరుజ్జీవం పొందాలనుకుంటోంది. అందుకే తూర్పు యూపీకి ఇన్ఛార్జిగా ప్రియాంకను నియమించింది. సమాజ్ వాదీ, బహుజన సమాజ్, భారతీయ జనతాపార్టీల మధ్య ఉత్తరప్రదేశ్ ఓటు బ్యాంకు సంఘటితమైపోయింది. అయితే 2009లో ఇక్కడ 20 స్థానాలను గెలుచుకోగలిగింది కాంగ్రెసు. మళ్లీ నాయకత్వ పటిమను అందించగలిగితే 2024 నాటికి ఆ స్థాయికి చేరుకోగలదనే నమ్మకం ఉంది. ఈలోపు 2022లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఆ ఎన్నికలకు ఇన్ చార్జి ప్రియాంక అని ఇప్పట్నుంచే ప్రచారం సాగుతోంది. అందుకే ముందుగా దక్షిణభారతం వైపు కాకుండా ఉత్తరభారతంలోనే ప్రియాంకను ప్రయోగిస్తున్నారు. ఆమె కారణంగా కాంగ్రెసుకు జనసమ్మోహక శక్తి ఏర్పడుతోందని ఇప్పటికే గుర్తించారు. ఇకపై ఎన్నికలతో సంబంధం లేకుండా మరింతగా ఆమెను రాష్ట్రంలో పర్యటింపచేయాలనుకుంటున్నారు.ప్రియాంక కరిష్మా చూసినవారు రాహుల్ గాంధీకి పోటీ అని భావిస్తారు. ఎందుకంటే రాహుల్ శైలితో పోల్చిచూస్తే దూసుకువెళ్లే తత్వం ప్రియాంకలో ఎక్కువ. అందులోనూ యువతను ఆకట్టుకోగల నేర్పు ఉంది. పాత తరానికి ఎలాగూ ఇందిరను గుర్తు తెస్తారు. ఈ పరిస్థితిని సైతం కాంగ్రెసు సులభంగానే అధిగమించగలమని చెబుతోంది. నిజానికి ప్రియాంక రాహుల్ గాంధీకి దేశవ్యాప్త మద్దతు కూడగట్టగలుగుతారంటున్నారు. కాంగ్రెసు పార్టీ పుంజుకుని స్థిరపడితే కేంద్రంలో అధికారం చేపట్టగల స్థాయికి చేరుకుంటే పార్టీ పగ్గాలు ప్రియాంక, ప్రధాని అభ్యర్థిత్వం రాహుల్ తీసుకుంటారని సీనియర్ కాంగ్రెసు వాదులు పేర్కొంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైఫల్యాలు వెన్నాడుతున్న రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా ఒక రక్షణ కవచంగా ప్రియాంక తోడ్పడతారనేది పార్టీ వర్గాల భావన.