గుంటూరు, మే 1, (way2newstv.com)
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మధ్య మాత్రమే పోటీ జరగలేదు. ఇక్కడ జనసేన ఒకటుందన్న విషయాన్ని అందరూ మర్చిపోయినట్లున్నారు. జనసేన అభ్యర్థికి మంచిపేరు ఉండటంతో సత్తెనపల్లిలో త్రిముఖపోటీ జరిగిందంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ తరుపున, వైసీపీ నుంచి అంబటి రాంబాబు, జనసేన పార్టీ నుంచి రాజకీయాల్లో విలువలు పాటించే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.టీడీపీ, వైసీపీలు ఇప్పుడు గెలుపు తమదంటే తమదని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఇద్దరికీ ధీమా లేదన్నది వాస్తవం. కోడెల శివప్రసాదరావు విషయమే తీసుకుంటే ఆయనకు సొంత పార్టీ నేతలే సహకరించలేదని చెబుతున్నారు. అయితే తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని కోడెల అంటున్నారు.
నరసరావు పేటలో జనసేన గట్టెక్కుతుందా
తొలుత కోడెల కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలోనే ఆందోళన చేసిననేతలను కోడెల బుజ్జగించినా ఆయనకు సహకరించలేదని చెబుతున్నారు. కోడెల తిరిగి గెలిస్తే తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించి టీడీపీ నేతలే కొందరు జనసేన పార్టీకి సహకరించారన్న టాక్ ఇక్కడ బాగా విన్పిస్తుంది.అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సత్తెన పల్లి నియోజకవర్గంలో కమ్మ, ముస్లిం, మాదిగ, రెడ్డి కులస్ధుల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముస్లిం, ఎస్సీ ఓట్లు తమకే పడ్డాయన్న ధీమాలో అంబటి ఉన్నారు. అంబటి రాంబాబుకు కూడా టిక్కెట్ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతలు లోటస్ పాండ్ వద్ద ధర్నాకు దిగారు. వారంతా ఇప్పుడు సత్తెన పల్లిలో జనసేనకు జైకొట్టారంటున్నారు. అయితే జగన్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున తన గెలుపు ఖాయమన్న ధీమాలో అంబటి రాంబాబు ఉన్నారు. అప్పుడే తమ గెలుపు ఖాయమైపోయినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.గమనించాల్సిన విషయమేమిటంటే జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వర రెడ్డికి మంచిపేరుంది. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఇక్కడ వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో పలుకుబడి ఉంది. కాపు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లతో పాటు ముస్లిం ఓట్లు కూడా తనకే పడ్డాయని యర్రం వెంకటేశ్వరరెడ్డి భావిస్తున్నారు. ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. త్రిముఖ పోటీలో కొద్ది ఓట్ల తేడాతోనైనా తాను గెలుస్తానని యర్రం ధీమాగా ఉన్నారు. ఇలా మూడు పార్టీలు ఎవరికి వారే ధీమా కనపరుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే అంబటి రాంబాబు, కోడెల శివప్రసాదరావులకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. కోడెలకు ఇవే చివరి ఎన్నికలన్న టాక్ విన్పిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి