అమరావతి, మే 2, (way2newstv.com)
రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలి?- అని ఎవరిని ప్రశ్నించినా.. ఎవరొచ్చినా మాకేం అభ్యంతరం లేదు. అనే వారి సంఖ్య ఎక్కువ. లేదా ఒక పార్టీకి మద్దతిచ్చేవారు, అభిమానం ఉన్న వారైతే.. జగనో లేదా చంద్రబాబో సీఎం అయితే బాగుంటుందని అంటున్నారు. కానీ, ఎవరూ కూడా ఫలానా నాయకుడు ఎట్టిపరిస్థితిలోనూ సీఎం కాకూడదు! అని చెబుతున్న ప్రజలు పెద్దగా మనకు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, దీనికి భిన్నంగా.. ఒక సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లు మాత్రం జగన్ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. కొంత విచిత్రంగా అనిపించినా.. నాలుగు రోజుల కిందట విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. అయితే, ఇది కోరం లేక పోవడంతో వాయిదా పడింది.కానీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, అందునా రాష్ట్రంలో సీఎస్ పాలన జరుగుతున్న సమయంలో ఇంత హడావుడిగా అత్యంత కీలకమైన అధికా రులు ఇలా భేటీ కావాలని నిర్ణయించడమే సంచలనం.
ఏపీలో రెండుగా విడిపోయిన అధికారులు..
ఇక, ఈ సమావేశానికి ముందు, వెనుకల పరిస్థితిని గమనిస్తే.. చాలా ఆసక్తికర పరిణామాలు గోచరమవుతున్నాయి. అధికారులు మొత్తంగా రెండు వర్గాలుగా చీలి పోయారు. జగన్‌ను సమర్ధించే వర్గం, ఆయనతో విభేదించే వర్గంగా అధికారులు మారిపోయారు. వీరిలో కుల సమీకరణలు కూడా పనిచేస్తున్నాయి. ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అధికారులు బహిరంగంగానే వైసీపీని ద్వేషిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగానే తమపై దాడులకు దిగుతామని, అరెస్టులు చేయిస్తామని బెదిరించారని వీరు అంటున్నారు. అదేసమయంలో జగన్‌ను సమర్ధించే వర్గం.. చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠాకు స్వేచ్ఛను ఇవ్వకుండా చంద్రబాబు హరించారని ఫలితంగా ఆయన ట్రాన్స్ ఫర్ అయ్యే పరిస్తితి వచ్చిందని వీరు ఆరోపిస్తున్నారు.జగన్‌ను వ్యతిరేకించే అధికారులు ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, మరోసారి కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు. పసుపు-కుంకుమ పథకాన్ని చంద్రబాబు ప్రకటించిన తర్వాత దీనిని ఆఘమేఘాలపై అమలు చేసింది తామేనని, దీని ఫలితం ఎలా ఉండబోతున్నదీ తమకు తెలుసునని అంటున్నారు. ముఖ్యంగా డీఎస్పీల బదిలీల విషయంలో జగన్ చేసిన కామెంట్లను కూడా ఈ వర్గం తెరమీదికి తెస్తోంది. ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అధికారులపై జగన్ కన్నెర్ర చేయడం ఏమేరకు సమంజసమని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ను వద్దంటున్న ఐఏఎస్ లను బుజ్జగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే, మరో వర్గం ఐఏఎస్‌లు మాత్రం చంద్రబాబు.. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఐఏఎస్‌లపై కక్ష సాధింపు విధంగా వ్యాఖ్యలు సంధించారని, వీటిని ఖండించేందుకే సమావేశానికి వచ్చామని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. మొత్తానికి.. రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేలకపోయినా.. అధికారులు మాత్రం ఇప్పటికే రెండు వర్గాలుగా మారిపోవడం మంచిది కాదని అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.