నిజమాబాద్, మే 3 (way2newstv.com):
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొదటి విడత కంటి వెలుగు పూర్తయింది. కానీ పని చేసిన సిబ్బందికి మాత్రం కష్టాలు తప్పడం లేదు. రెండు నెలలుగా వేతనాల బకాయిలు చెల్లించలేదు. నేత్ర వైద్య సహాయకులు, వారితో పాటు వైద్య సిబ్బందికి నయా పైసా విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలోని గ్రామాల్లో గతేడాది కంటి వెలుగు శిబిరాలను నిర్వహించారు. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించే బృందంలో ఒక వైద్యాధికారి, ఒక నేత్ర వైద్య సహాయకుడు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించారు. ఏడాది కాలంగా సమర్థంగా విధులు నిర్వహించి సత్ఫలితాలు సాధించారు.
వెలుగులో చీకటి (నిజామాబాద్)
కామారెడ్డి జిల్లాను కంటి వెలుగు పథకంలో అగ్రస్థానంలో నిలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పనికి తగిన ప్రతిఫలం లేక రెండు నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తున్నామని వైద్యాధికారులు, సిబ్బంది వాపోతున్నారు.జిల్లాలో కంటి వెలుగు పథకాన్ని అమలు చేసిన వైద్యాధికారులు, సిబ్బందికి 40 నుంచి 60 రోజులకోసారి డబ్బులు ఖాతాలో వేస్తామని చెప్పారు. దీంతో సమష్టిగా బాధ్యతలు పంచుకొని చక్కగా విధులు నిర్వహించారు. కానీ ఆశించిన మేర వేతనాలు దక్కక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లో శిబిరాల నిర్వహణ సమయంలో రవాణా ఖర్చులను సొంతంగా పెట్టుకుని వెళ్లారు. మారుమూల పల్లెలకు సైతం వెళ్లి సేవలందించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లిన వారు సొంతంగా ఇంధనాన్ని సమకూర్చుకొన్నారు. ఉభయ జిల్లాల్లో శస్త్రచికిత్సకు సిఫారసు చేసిన 62 వేల మంది బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తామన్నా అతీగతీ లేదు. వైద్యులు, శస్త్రచికిత్స చేసే ఆస్పత్రుల కొరత కారణంగా బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు రావడం లేదు.