మితిమీరుతున్న ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మితిమీరుతున్న ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు

ఖమ్మం, మే 8 (way2newstv.com)
భద్రాచలం పట్టణంలో అనేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహించకూడదు అనే నిబంధన ఉండటంతో మైదాన ప్రాంతంలో తమకు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ కేవలం బ్రాంచ్‌లు మాత్రమే నెలకొల్పి తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అధికారులను బురడీ కొట్టిస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్‌లు ఇవ్వడమే కాకుండా అనధికార చిట్టీ వ్యాపారాలు కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో వందల సంఖ్యల్లో ఉన్న ఈ కార్యాలయాల్లో ఫైనాన్స్ దందా నిత్యకృత్యం. కన్సల్టెన్సీ పేరుతో కొన్ని సంస్థలు పట్టణంలో వెలిశాయి. వీటికి రిజిస్ట్రేషన్ లేకపోయినా బోర్డులు పెట్టి మరీ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరికొన్ని బోర్డులు పెట్టకుండా చాప కింద నీరులా తమ పనులు తాము చేసుకుంటున్నాయి. కొన్ని వాహనాల షోరూముల్లో సైతం ఫైనాన్స్ దందా సాగుతోంది. ఈ షోరూముల్లో పట్టణానికి చెందిన కొందరు ఫైనాన్స్ వ్యాపారులు అనుమతులు లేకుండా వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఫైనాన్స్ చేస్తున్నారు. వీరిని ఆయా షోరూముల యజమానులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.షోరూమ్ సంస్థల నుంచి భారీగానే సొమ్ములు అందుతున్నాయని తెలుస్తోంది. 


మితిమీరుతున్న ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు

ఇలా వాహన కొనుగోలుదారుడికి ఫైనాన్స్ ఇచ్చిన వ్యాపారులు సకాలంలో ఫైనాన్స్ కట్టని వాహన దారునిపై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చక్రవడ్డీలు వేసి మరీ సొమ్ములు గుంజుతున్నారు. ఫైనాన్స్ ఆగడాలు భరించలేక అనేకమంది పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించిన సందర్భాలూ లేకపోలేదు. ఇక చిట్టీల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. సర్వీస్ సెంటర్ల పేరుతో చిట్‌ఫండ్ ప్రైవేట్ సంస్థలు విచ్చలవిడిగానే వెలిశాయి. మైదాన ప్రాంత పట్టణ పేరుతో ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ముందస్తుగా తీసుకొని ఫైనాన్స్ తీసుకున్న సామాన్య వ్యక్తి నడ్డివిరిసేలా ముక్కుపిండి మరీ పైసలు వసూలు చేస్తున్నాయి. ఈ రకమైన సంస్థలే కాకుండా బోర్డులు లేని చిట్టీ వ్యాపారాలు ఇక లెక్కేలేదు. వీధివీధికీ చిట్టీ వ్యాపారులు వెలిశారు. నిత్యం రూ.కోట్లల్లోనే చిట్టీ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలతో కొందరు రూ.కోట్లకు పడగలెత్తగా.. మరికొందరు దివాళా తీసి ఐపీలు పెట్టినవారు లేకపోలేదు.ఇక సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ సంస్థలు భద్రాచలం పట్టణంలో భారీగా వెలిశాయి. వీటికి అసలు ఎటువంటి అనుమతులూ లేవు. అయినప్పటికీ బోర్డులు పెట్టి మరీ వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేసే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ముందస్తుగా ఫైనాన్స్‌లు ఇచ్చి రెట్టింపు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలంలో సొమ్ములు చెల్లించని వ్యక్తులపై కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇండ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రూ.కోట్లల్లోనే ఇటువంటి సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలు కొనసాగుతున్నాయి. అతి తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేసి ఎక్కువ సొమ్ములకు వీటిని విక్రయిస్తున్నారు. గత్యంతరం లేని వారు వీటినే కొనుగోలు చేసి ఫైనాన్స్ తీసుకొని వీరి కంబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నారు. పట్టణంలో ఇంత విచ్చలవిడిగా ఫైనాన్స్ వ్యాపారాలు సాగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు నిరోధించలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా ఎస్పీగా ఏవీ రంగనాథ్ ఉన్నప్పుడు ఫైనాన్స్ వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపారు. అప్పుడు కొంతకాలంపాటు అనధికార ఫైనాన్స్ వ్యాపారాలు తగ్గాయి. ఇటీవల కాలంలో వీటి గురించి ఎవ్వరు పట్టించుకోకపోవడంతో మళ్లీ విజృంభించాయి.