హైద్రాబాద్, మే 13, (way2newstv.com)
అసలే వేసవికాలం. మండే ఎండలకు ప్రజలు, వాహనదారులు దప్పికతో అలమటిస్తుంటారు. నగరంలో ఏర్పాటు చేసిన నీటి ఏటీఎం కేంద్రాలు మలక్‌పేటలోని కొన్ని ప్రాంతాల్లో అలంకార ప్రాయంగా ఉన్నాయే తప్ప ప్రజల దాహార్థిని తీర్చడానికి ఉపయోగపడటం లేదు. ఆశయం గొప్పగా ఉన్నా ఆచరణలో మాత్రం కనబడటం లేదు. దిష్టి బొమ్మల్లా దర్శనం ఇస్తున్న నీటి ఏటీఎం కేంద్రాలు అందుకు నిదర్శనం. నగర వాసుల దాహార్థి తీర్చేందుకు శుద్ధ జలంతో కూడిన నాణ్యమైన తాగునీటిని అత్యంత తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఏడాది క్రితం నగర వ్యాప్తంగా 100కు పైగా నీటి ఏటీఎం కేంద్రా లను ఏర్పాటు చేసింది. ఇలా పూర్తి సాంకేతిక పరిజ్ఞా నంతో ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.
అక్కరకు రాని వాటర్ ఏటీఎంలు
నిర్వాహణ సరిగా లేకపోవడంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అత్యంత రద్దీ ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లో నీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందరికీ తక్కువ ధరకే సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ది చేసిన త్రాగునీరు, అవి తాగేందుకు గ్లాస్‌ల సదుపాయం ఏర్పాటు చేశారు. నీటి కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వాహణ విషయా న్ని మాత్రం గాలికి వదిలేశారు. ఏర్పాటు చేయడంలో చూపిన ఆర్భాటం ఆచరణలో అలసత్వంగా మారడంతో అనుకున్న ఆశయం అటకెక్కింది. సాధారణంగా వేసవిలో పలు స్వచ్ఛంద సంస్థలు ఉదారంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేస్తారు. అందుకు గాను ఆయా సంస్థలు ప్రతి చలివేంద్రంలో తాగునీరు ఇచ్చేందుకు ఒకరిని ఏర్పాటు చేస్తారు. అలాగే వాటర్ ఏటీఎంలలో కూడా ప్రజలకు అక్కడి సాంకేతికత అర్థమయ్యే వరకు ఒకరిని ఏర్పాటు చేసి కేంద్రంలో నాణెలు ఉపయోగించి మంచినీరు ఎలా పొందాలో తెలియజేయాలి. వాటర్ క్యాన్‌లలో, ప్లాస్టిక్ కవర్లలో ప్రయివేటు కంపెనీలలో అందించే నీరు ఎందుకు ఉపయోగించకూడదో వివరిస్తూ అవగాహన పెంచాలి. ఇలా కొద్దిపాటి మార్పులు చేసి నీటి ఏటీఎంలను వేసవికాలంలో ప్రజలకు అందుబాటు లో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది.