విశాఖపట్టణం, మే 4, (way2newstv.com)
ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరగడంతో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ చాలా మంది అభ్యర్థులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పోటీతో జరిగిన ముక్కోణపు పోటీలో సామాజిక వర్గాల ఈక్వేషన్లు బాగా పని చేశాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయడంతో కొన్ని చోట్ల ఎంపీ ఓటు ఒక పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరో పార్టీకి వేసిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సహజంగా క్యాస్ట్ ఈక్వేషన్లు ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పని చేస్తుంటాయి. ఈ ఎన్నికల్లో అందుకు భిన్నంగా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఓటరు తమ సామాజికవర్గ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపారు. వైసీపీ అధినేత జగన్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆ ప్రాంతంలో… ఏ సామాజికవర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందో ఆ సామాజికవర్గానికి చెందిన వారిని రంగంలోకి దింపడం ద్వారా టిడిపికి చాలా వరకు చెక్ పెట్టారు.ఉదాహరణకు అనంతపురం జిల్లాలో బీసీల ఓటింగ్ చాలా ఎక్కువ.
ట్రయాంగిల్ ఫైట్.... క్రాస్ ఫైట్
జగన్ ఈ ఎన్నికల్లో అనంతపురం, హిందూపురం రెండు లోక్‌సభ సీట్లను బీసీలకు ఇచ్చి చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం లోక్‌సభ సీట్లను సైతం బీసీ వర్గానికి కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్న కాళింగ సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ సామాజిక వర్గంలో బలమైన నేతగా దూసుకుపోతున్న దువ్వాడ శ్రీనివాస్‌కు ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుకు చెక్పెట్టారు. ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు గెలుపుకోసం ఏటికి ఎదురీది వలసిన పరిస్థితి వచ్చింది.విజయనగరం లోక్‌సభ సీటు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ అశోక్ గజపతిరాజుకు ఈసారి వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ నుంచి గట్టి పోటీ ఎదురయింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స సత్యనారాయణకు అనుచరుడు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స పైనే వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఈ ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేసిన మృణాలిని చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జగన్ బొత్సకు చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వడంతో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న బెల్లానకు విజయనగరం ఎంపీ సీటు ఇచ్చారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్లతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోనూ కాపులు ఎక్కువగా ఉండడంతో వీరంతా ఈ ఎన్నికల్లో బెల్లానకే ఓట్లు వేశారంటున్నారు.విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి అశోక్ కుమార్తె అతిథి అసెంబ్లీకి పోటీ చేశారు. అసెంబ్లీకి ఆమెకు ఓటు వేసిన కాపు సామాజిక వర్గం వారు ఎంపిక మాత్రం వైసిపికి అనుకూలంగా ఓటు వేశారు. ఇక నెల్లిమర్లలో టిడిపి సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడుకు ఓటు వేసిన కాపు వర్గం వారు ఎంపీకి మాత్రం తమ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు అనుకూలంగా ఓటు వేసిన కాపులు…. ఎంపికి మాత్రం వైసీపీకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాజాంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఏదేమైనా ఈ సారి అశోక్ గజపతిరాజు తనకన్నా రాజకీయంగా చాలా జూనియర్ అయిన బెల్లాన చంద్రశేఖర్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారు. వైసీపీ అధినేత వేసిన క్యాస్ట్ ఈక్వేషన్ లెక్కలు అశోక్ పాలిట శాపంగా మారాయి. మరి ఈ ఈక్వేషన్‌లను ఆయన ఎంత వరకు చేధించి గెలుస్తాడో ? చూడాలి.