హైద్రాబాద్, మే 8, (way2newstv.com)
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ పరిధిలో మరోసారి కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ‘గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3 వేల కోతులు ఉంటాయి. ఒక్కో గుంపు కొంత కాలంపాటు కొన్ని ప్రాంతాలను ఆవాసంగా మార్చుకుంటాయి. అనంతరం అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఈ క్రమంలో కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు పరిసరాలపై పట్టు సాధించేందుకు అల్లరిమూకల్లా ప్రవర్తిస్తాయి. జనావాసాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తాయి.
భాగ్యనగరంలో కోతుల స్వైర విహారం
వాటి ఆవాసానికి సరిపడా చెట్లు లేకపోవడమూ ఇందుకు కారణం. పండ్లు, ఫలాలను ఇచ్చే వృక్షాలు లేనప్పుడు ఇళ్లలోకి చొరబడి, దుకాణాల్లో వస్తువులను ఎత్తుకెళ్లడం వానరాలకు తప్పనిసరిగా మారింది. దాడి చేయడం వాటికున్న సహజ లక్షణం అయినందున కొన్ని సందర్భాల్లో మనుషులు గాయాలకు గురౌతున్నారు.అంబర్‌పేట,రామ్ నగర్, లలితానగర్, విద్యా నగర్ కూకట్‌పల్లి, జీడిమెట్ల, పద్మారావునగర్, ఓయూ, డీడీ కాలనీ, చిక్కడపల్లి, మారేడుపల్లి, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, దిల్‌సుక్‌నగర్, గచ్చీబౌలీ, ప్రాంతాల నుంచి కోతుల సమస్యపై బల్దియాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పిల్లలు తినుబండారాలతో వెళ్తున్నప్పుడు దాడులు చేస్తున్నాయని, ఇళ్లలోకి చొరబడి పాత్రలు, సామాన్లు ఎత్తుకెళ్తున్నాయని స్ధానికులు చెబుతున్నారు.