భూనిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందజేత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భూనిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందజేత

గజ్వేల్, మే 04: (way2newstv.com)
శ్రీ కొమురవెళ్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే 8 గ్రామాలలోని ప్రజలకు ఆర్అండ్ఆర్లో మెరుగైన ప్యాకేజీలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ చెప్పారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరు పల్లి గ్రామాలలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ప్రత్యేకంగా నియమించిన ఆర్డీఓ అధికారులు, తహశీల్దార్ల బృందం, రెవెన్యూ శాఖ అధికారిక బృందాలతో కలిసి ముంపునకు గురయ్యే గ్రామ భూ నిర్వాసితులకు పరిహారాన్ని, ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ మాట్లాడుతూ.. ముంపు గ్రామాలలో ఇప్పటికే సామాజిక సర్వే, గ్రామ సభలు నిర్వహించామని వివరిస్తూ.., ఒక్కొక్కరి పేరిట ఆర్అండ్ఆర్ గెజిట్ విడుదల కావాల్సి ఉంటుందని, చట్ట ప్రకారం ముంపునకు గురయ్యే గ్రామ ప్రజలు మెచ్చిన పరిహారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు.


భూనిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందజేత

ప్రతి కుటుంబానికి రూ.7.50 లక్షల ప్యాకేజీని, పెళ్లి కానీ, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ రూ.5 లక్షల రూపాయల ప్యాకేజీతో పాటు ఇంటి స్థలాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 11, 12వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ప్యాకేజీలను మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పూర్తిస్థాయిలో పారదర్శకంగా సర్వే చేశామని, ఏ చిన్న తప్పు జరిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని నిర్వాసితులను కోరారు. ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా న్యాయం జరిగేలా చూస్తామని వెల్లడించారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండపాక మండలం సింగారంతో పాటు సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తొగుట మండలం లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరు పల్లి గ్రామంలో భూ నిర్వాసితులకు ప్యాకేజీ, నష్టపరిహారం, ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తెలిపారు. - గ్రామాలు ఖాళీ చేయిస్తామనే.. అసత్య ప్రచారాలు.. నమ్మొద్దు
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులను గ్రామంలో నుంచి వెళ్ల గొడుతారని., గ్రామాలు ఖాళీ చేయిస్తారంటూ.. జరిగే అసత్య ప్రచారాలు, అపోహలను నమ్మొద్దని సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు క్రిష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డిలు కోరారు. ఈ కార్యక్రమంలో గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ప్రత్యేకంగా నియమించిన ఆర్డీఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ శాఖకు చెందిన అధికారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.