మీ సేవ కేంద్రం ద్వారా కొత్త జాబ్‌కార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మీ సేవ కేంద్రం ద్వారా కొత్త జాబ్‌కార్డులు

అదిలాబాద్, మే 8, (way2newstv.com)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మంచి రోజులొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కూలీలకు ప్రత్యేక కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 1.50 లక్షల జాబ్‌కార్డుల ఉండగా.. 3.20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి రూ.కోట్లు మంజూరు చే స్తోంది. ప్రస్తుతం జిల్లాలో నీటి నిల్వకుంటలు, వర్మీకంపోస్టు తయారీ, భూ అభివృద్ధి కందకాలు, తదితర పనులు చేపడుతున్నారు.2006 సంవత్సరంలో ఉపాధి హామీ  పథకం ప్రారంభమైన తర్వాత అప్పటి ప్రభుత్వం కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేసింది. ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధిక నిధులు వెచ్చిస్తుండడంతో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంఖ్య పెరుగుతున్నా కొత్త జాబ్‌కార్డులు మాత్రం జారీ చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది.ప్రభుత్వం కూలీలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకునే విధంగా సాంకేతికతతో కూడిన జాబ్‌కార్డులను అందజేస్తోంది. కొత్తగా పనిచేస్తున్న వారితోపాటు పాత వారికీ జాబ్‌కార్డులు ఇస్తున్నారు. వీటిపై క్యూఆర్‌కోడ్‌ ముద్రించారు. నూతన జాబ్‌కార్డుల్లో సాంకేతికత జోడించి ఇవ్వడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కార్డుపై జాబ్‌కార్డు నెంబర్‌తోపాటు ఆధార్‌ నంబర్, పొటో, కూలీ చెల్లింపు ఖాతా నంబర్, బ్యాంకు ఖాతా, పోస్టల్‌ శాఖ ఖాతా నంబరు ముద్రించి ఉంటాయి. ఒక కుటుంబం నుంచి ఎంత మంది కూలీ పనికి వచ్చినా అందరికి కలిపి ఒక కార్డు మాత్రమే ఇస్తారు. 



మీ సేవ కేంద్రం ద్వారా కొత్త జాబ్‌కార్డులు

కూలీలు తమ సెల్‌ఫోన్‌లో ఈజీఎస్‌ యాప్‌డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ రోజు ఎన్ని గంటలు పనిచేశారు, ఎంత కూలీ వస్తుంది తదితర వివరాలు తెలుసుకోవచ్చు. జాబ్‌కార్డుకు ఆధార్‌ నంబర్‌ లింకు చేశారు.ఉపాధి హామీ పథకంలో కొందరు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడేవారు. ఒకరికి బదులు మరొకరికి హా జరు వేయడం, పని గంటలు తక్కువ నమోదు చేయ డం వంటివి చేసేవారు. దీంతో సామాజిక తనిఖీల సమయంలో ఈజీఎస్‌ సిబ్బంది అక్రమాలు బయటకు వచ్చేవి. జరిమానా దాన్ని సరిపెట్టేవారు. ఇక నూతన జాబ్‌కార్డులతో ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాబ్‌కార్డులో ఆధార్‌లింకు, క్యూఆర్‌కోడ్‌ ముద్రించడం వల్ల అక్రమాలకు తావులేకుండా చేయవచ్చని డీఆర్‌డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌ తెలిపారు.జాబ్‌కార్డు కోసం మ్యానువల్‌గా దరఖాస్తు చేసుకుని అధికారులు చుట్టూ తిరిగే కూలీలకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఇందులో భాగంగానే జాబ్‌కార్డు ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసింది. కొత్తగా జాబ్‌కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో అందజేస్తారు. తద్వారా కూలీలకు సమయం ఆదాతోపాటు వేగంగా కార్డు పొందే అవకాశం ఏర్పడింది. మారుతున్న  కాలానుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా మార్పులు చేస్తూనే ఉన్నాయి.అందుబాటులో ఉన్న వనరులు, సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకుని కూలీలు, రైతులకు సులభతరంగా సేవలందిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో చాలా సేవలను ఆన్‌లైన్‌లో చేసిన ప్రభుత్వం తాజాగా జాబ్‌కార్డు ప్రక్రియను కూడా మీసేవ కేంద్రాలతోపాటు ఇంటర్నెట్‌ లో దరఖాస్తు చేసుకునేందుకు అనుసంధానం చేసింది. గతంలో జాబ్‌కార్డు కా>వాలంటే తొలుత అధికారులకు దరఖాస్తులు చేసుకుని అధికారుల కోసం వేచి చూడాల్సి వచ్చేది. దీంతో వారి ఇబ్బందులను తొలగించేందుకు కార్డుల దరఖాస్తు, మంజూరు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులుగా గుర్తిస్తారు. ఈ దరఖాస్తులను డీఆర్‌డీవోకు పంపించి అక్కడి అధికారులు పరిశీలించిన తర్వాత మీసేవ కేంద్రం ద్వారా జాబ్‌కార్డులు జారీ చేస్తారు.