విశాఖపట్టణం, మే 7,(way2newstv.com)
విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీ కర్మాగారాల్లో పారిశ్రామిక ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. పరిశ్రమల్లో భద్రతా చర్యలు మృగ్యం కావడంతో తరచు జరుగుతున్న ప్రమాదాల్లో ఎన్నో విలువైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రసాయన , ఫార్మా కంపెనీల్లో తరచు ప్రమాదాలు జరగుతున్నా ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు కళ్లు తెరవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యంతోనే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రత డొల్లగా మారడంతో రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీల్లో జరిగే ప్రమాదాల్లో ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలు పెరుగుతున్నా ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కళ్లు తెవరడంలేదు.
ఫార్మా సిటీలో కనిపించని భద్రతా చర్యలు
ఇకనైనా పాలకులు, అధికారులు కళ్లు తెరచి ఫ్యాక్టరీలను తనిఖీ చేసి, భద్రతకు విస్మరించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. విశాఖ జిల్లా పరవాడ... ఫార్మా పరిశ్రమలకు ప్రసిద్ధి. పరవాడ ఫార్మా సిటీ ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలు అంతంత మాత్రమే. కంపెనీ యాజమాన్యాల లాభాపేక్ష, కార్మిక శాఖ అధికారుల అవినీతి... కార్మికులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. తరచు జరుగుతున్న ప్రమాదాలతో ఎన్నో కార్మిక కుటుంబాలు వీధినపడుతున్నాయి. సాగర నగరం చుట్టుపక్కల 90కిపైగా రసాయన, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో రియాక్టర్లే బాంబుల్లా పేలిపోతున్నాయి. 2016 జనవరిలో రాజవరంలోని దక్కన్ కెమికల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న బయోమాక్స్‌లో గత ఏడాది జరిగిన ప్రమాదంలో 12 డీజిల్ ట్యాంకులు కాలిపోయాయి. 2016 మేలో పరవాడ ఫార్మాసిటీలోని శ్రీకర్ ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది నవంబర్ 10న లారస్ ల్యాబ్స్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో కార్మికుడు దుర్మణం పాలయ్యాడు. గత డిసెంబర్‌లో ఎస్‌వీఆర్ డ్రగ్స్‌లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. తాజాగా లంకెలపాలెం అజికో బయో ఫార్మాలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా కొండవీటి చేతాండత ఉంటుంది. భద్రతా లోపాలతో మరిన్ని ప్రాణాలు పోకముందే భద్రత పాటించే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.