దళారులకు వరంగా మారిన ధాన్యం కొనుగోళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దళారులకు వరంగా మారిన ధాన్యం కొనుగోళ్లు

విజయవాడ, మే 6, (way2newstv.com)
రైతుల బలహీనత దళారులకు, మిల్లర్లకు వరంగా మారింది. దీంతో ధాన్యం కొనుగోల్లను గ్రామానికో రేటుగా చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల ఆచూకీ లేదంటున్నారు. అధికారులు ప్రకటనలకే పరిమిత మవుతున్నారని విమర్శిస్తున్నారు. మండలంలోని ఇరవై గ్రామాల్లో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రమైన కంకిపాడులో జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం (డిసిఎంఎస్‌) ఆద్వర్యంలో ఒకటి, వెలుగు (డి.ఆర్‌.డి.ఏ) ఆధ్వర్యంలో ఈడుపుగల్లు, మారేడుమాక, వేల్పూరు గ్రామాల్లో మూడు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఏసిఎస్‌)ల ఆధ్వర్యంలో ఉప్పులూరు, తెన్నేరు, మంతెన, ప్రొద్దుటూరు, పునాదిపాడు, కోలవెన్ను, నెప్పల్లి, కుందేరు, గొదడవర్రు గ్రామాల్లో తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అనేక షరతులు విధించటంతో పాటు రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది.


దళారులకు వరంగా మారిన ధాన్యం కొనుగోళ్లు

ప్రభుత్వం చెప్పే నిబంధనలు ప్రకారం పంట కోసిన తర్వాత ఆరబెట్టకపోతే గింజలు రంగుమారి, పాడైపోయి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, నూర్చేటప్పుడు నేల మీద ప్లాస్టిక్‌ సంచులతో కుట్టిన పట్టాలు కానీ, టార్పాలిన్లు కానీ అడుగున వేయాలని, పంటలో తప్ప, తాలు, పొల్లు, చెత్తా చెదారం పోయేటట్లుగా బాగా ఎగురవేయాలని, ధాన్యంలో తేమ ఆరకుండా బస్తాల్లో వేసి లాటుకట్టకూడదని, అలాగే ధాన్యంలోని రాశిలోని అన్ని వైపుల నుంచి ధాన్యం సేకరించి తీసుకురావాలని అపుడు నాణ్యతను పరీక్షించి తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాకుండా మట్టి, రాళ్లు, ఇసుక లాంటి వ్యర్థ పదార్థాలు 1 శాతం, గడ్డి, చెత్త, తప్ప, కలుపు విత్తనాలు 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యపు గింజలు 5 శాతం, పరిపక్వము కాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు, 3 శాతం, తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు గ్రేడు ఏ రకం కొనుగోలు 6 శాతం తేమ 17 శాతం లోపు ఉండాలని అధికారులు చెప్పినట్లు అన్నీ చేసినా కొనుగోలుకు వచ్చినపుడు ఏదో ఒక వంక చెబుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. కానీ అధికారుల మండల కేంద్రమైన కంకిపాడులోని జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 77 మంది రైతులకు ధాన్యం కొనుగోలు ద్వారా సుమారు 1 కోటి రూపాయిలు చెల్లించినట్లు, వెలుగు (డీఆర్‌డిఏ) 3 కేంద్రాల ద్వారా 80 లక్షలు కొనుగోలు చేపట్టినట్లు, 13 ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాల ద్వారా 8 కోట్లు కొనుగోలు చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే మండలంలోని కొనుగోలు కేంద్రాలు సామాన్యులకు నష్టాలు, భూస్వాములకు లాభాలు తెచ్చేవిగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతులు మాత్రం కల్లాల్లో, రోడ్లపై ఖాళీగా ఉండే ప్రదేశాలలో పట్టాలు వేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొన్ని చోట్ల నానాతిప్పలు పడి సంచులు చూసుకుని వాటిలోకి నింపుకుని కష్టానికి తగ్గ ధర కోసం ఎదురుచూస్తున్నారు.