పాడిపైనే దృష్టి(ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాడిపైనే దృష్టి(ఖమ్మం)

ఖమ్మం, మే 6  (way2newstv.com): 
వేసవిలో పాలసేకరణ పెంచేందుకు విజయడెయిరీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ప్రస్తుతం వేసవి కాలం కావటం, దీనికి తోడు గత కొన్ని నెలల నుంచి ప్రోత్సాహకాలు అందకపోవటం, ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ ఏర్పడటం లాంటి కారణాలతో పాలసేకరణ మందగించింది. దీంతో పాలసేకరణ పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవిభాజ్య ఖమ్మం జిల్లాలో గేదెపాల నాణ్యత ఉండటం విశేషం. ఇక్కడి పాలలో 6.4 నుంచి 6.5శాతం వెన్నశాతం ఉంటుంది. అదే ఇతర జిల్లాల్లో అయితే 4.7శాతం నుంచి 4.8శాతం మాత్రమే వెన్న ఉంటుంది. ఇక్కడ 95శాతం గేదెపాల దిగుబడి అధికంగా ఉండగా ఇతర జిల్లాల్లో ఆవుపాల దిగుబడి అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో జిల్లాకు చెందిన పాలతో పాల ఉప ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 8,500 లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. ఇక్కడి పాలతో విజయడెయిరీలో రోజుకు 750కేజీల పెరుగు, 200లీటర్ల మజ్జిగ, తయారు చేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ అమ్మకాలు పోను మిగిలిన 2వేల లీటర్ల పాలను హైదరాబాద్‌ పంపుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయడెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4ల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. 2018 మే నెల నుంచి ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 


పాడిపైనే దృష్టి(ఖమ్మం)

2017 నవంబరు నుంచి రైతులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు సహకార సంఘాల ద్వారా ప్రోత్సాహకాలను పంపిణీ చేసే వారు. ఇక నుంచి మంజూరైన నిధులు ఇక నేరుగా రైతుల ఖాతాలోనే జమచేయనున్నారు. జిల్లాలో మొత్తం 2వేల మంది రైతులు విజయడెయిరీకి పాలు పోస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు రూ.11లక్షల వరకు ప్రోత్సాహకాలను చెల్లించాల్సి ఉంది. విడతల వారీగా వీటిని చెల్లిస్తున్నారు. ఇవి సకాలంలో మంజూరు కాక పోవటంతో కొంత మంది రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో ప్రైవేటు డెయిరీలు 12 వరకు ఉన్నాయి. వీటి నుంచే విజయడెయిరీకి పోటీ ఎదురవుతోంది. విజయడెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.56 చొప్పున చెల్లిస్తారు. దీనికి ప్రభుత్వం ప్రోత్సాహం లీటరుకు రూ.4 కలుపుకొని మొత్తం రూ.60 చెల్లిస్తున్నారు. దీంతో ప్రైవేటు డెయిరీలు కూడా అక్కడక్కడ అవసరాలను బట్టి లీటరుకు రూ.58 నుంచి రూ.60 వరకు చెల్లిస్తున్నాయి. ఇవి వెంటనే చెల్లించటం వల్ల కొంతమంది రైతులు ఆకర్షితులవుతున్నారు. దీని వల్ల విజయడెయిరీకి పాలుపోసే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ తట్టుకోవాలంటే ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం విజయిడెయిరీకి పాలు పోస్తున్న రైతులకు వారానికోసారి చొప్పున పాల బిల్లు చెల్లిస్తారు. ఇది రైతులకు చేరే సరికి 11 రోజులవుతోంది. దీంతో చాలా మంది రైతులు తమకు పాలుపోసిన వెంటనే బిల్లు చెల్లించాలని కోరుతున్నారు. దీంతో ప్రస్తుతం విజయడెయిరీ ఉపసంచాలకుడు డాక్టర్‌.శ్రావణ్‌కుమార్‌ రూ.4లక్షల అడ్వాన్స్‌ కోసం రాష్ట్ర పాడిపరిశ్రమ సమాఖ్య అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇవి త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉంది. అడ్వాన్సు నిధులు మంజూరైతే రైతులకు ఏరోజు చెల్లింపులు ఆరోజు చేస్తారు. దీని ద్వారా పాలసేకరణ కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. గత నెలలో పాలసేకణ జిల్లాలో రోజుకు 9,500 లీటర్లు ఉండగా ప్రస్తుతం 8,500లీటర్లకు తగ్గింది. వేసవిలో వస్తున్న ఈ లోటును పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.వేసవి వచ్చే సరికి పాల దిగుబడి సహజంగానే కొంత తగ్గుతుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో దిగుబడి తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం విజయడెయిరీపై పడింది. గత సంవత్సరం ఇదే సమయానికి రోజుకు 6,700లీటర్ల పాలసేకరణ జరగ్గా ఈసంవత్సరం 8,000 లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే కొంత ఎక్కువైనప్పటికీ దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు ఆవైపు దృష్టి పెట్టారు.