ఖమ్మం, మే 27 (way2newstv.com):
పేదలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేసిన పనిలో 40శాతం నిధులను మెటీరియల్ కాంపొనెంట్గా మంజూరు చేస్తారు. గ్రామ స్థాయిలో కూలీలు ఎంత కష్టపడితే అంత అదనపు నిధులు గ్రామాభివృద్ధికి వస్తాయి. మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామంలో, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే పనులు చేపడతారు. దీనిలో భాగంగా జిల్లాలోని 20 మండలాల్లో అనేక పనులు మంజూరు చేశారు. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం, అధికారుల సరైన పర్యవేక్షణ లేక మంజూరైన అధిక శాతం పనులు ప్రారంభమే కావడం లేదు. ప్రారంభించిన అరకొర పనులు సైతం అసంపూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి వంట గదులు అవసరమయ్యాయి. జిల్లాలో 216 పాఠశాలల్లో వంట గదులు మంజూరు చేస్తే కేవలం 33 పూర్తిచేశారు. మరో 78 నిర్మాణ పురోగతిలో ఉండగా, 105 పనులు ప్రారంభమే కాలేదు. దీంతో అనేక పాఠశాలల్లో ఎండావానలతో అవస్థపడుతూ విద్యార్థుల కోసం వంట ఆరుబయటనే తయారు చేయాల్సి వస్తోంది.
పేరుకే పథకం..మరి పనికి.? (ఖమ్మం)
జిల్లాలోని అనేక పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ఉంది. సమస్య పరిష్కారంగా 251 మరుగుదొడ్లు మంజూరు చేశారు. వీటిలో కేవలం 23 మాత్రమే పూర్తి చేశారు. మరో 72 పనులు పురోగతిలో ఉన్నాయి. మరుగుదొడ్లు లేక విద్యార్థిని, విద్యార్థులు అవస్థ పడుతున్నారు. శ్మశానవాటికల్లో సమస్యల పరిష్కారానికి వైకుంఠధామం పేరిట అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలో 183 మంజూరు చేయగా కేవలం ఆరు మాత్రమే నిర్మాణ పనులు పూర్తి చేయగలిగారు. మరో 43 పనులు పురోగతిలో ఉన్నాయి. మురుగు, భూగర్భ జలాల సమస్య పరిష్కారంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 80,337 మంజూరు అయ్యాయి. వీటిలో 13,352 పూర్తి చేయగా, 4,880 నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు పూర్తి చేస్తే గ్రామాల్లో మురుగు సమస్య పరిష్కారం కావడంతోపాటు, దోమల ఉధృతి తగ్గుతుంది. వర్షపు నీరు ఇంకి భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో వ్యర్థాలతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. పారిశుద్ధ్య సమస్య పరిష్కారంగా గ్రామ శివార్లలో డంపింగు యార్డులు నిర్మించాలని తీర్మానించారు. జిల్లాలో 336 మంజూరు చేశారు. వీటిలో కేవలం 73 పూర్తి చేయగా, మరో 76 నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలో అసంపూర్తి ఉపాధి పనులతో రూ.కోట్లలో నిధులు వృధాగా ఉన్నాయి. వేసవితో గ్రామాల్లో ఉపాధిలో మంజూరైన పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటి నిర్మాణంపై దృష్టి సారిస్తే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసిన వారవుతారు. అలాగే పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రామ స్థాయిలో శ్మశానవాటికలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి ఇంకుడు గుంతలు నిర్మిస్తే మురుగు సమస్య, డంపింగ్ యార్డులు పూర్తి చేస్తే పారిశుద్ధ్య సమస్య పరిష్కారం అవుతాయి.