వెలగపూడికి బెర్త్ ఖాయమేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వెలగపూడికి బెర్త్ ఖాయమేనా

విశాఖపట్టణం, మే 18, (way2newstv.com)
విశాఖ అర్బన్ జిల్లాలో తూర్పు సీటు ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సీటు టీడీపీకి పెట్టని కోటగా చేసిన ఘనత సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుదే. 2009లో ఏర్పాటు అయిన ఈ సీటు నుంచి మొదటిసారిగా పోటీ చేసిన వెలగపూడి కేవలం మూడు వేల మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో ప్రజారాజ్యం తరఫున వంశీక్రిష్ణ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ వేవ్ కూడా ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య వెలగపూడి తొలివిజయం అందుకున్నారు. అపుడు గెలిచినా టీడీపీకి అధికారం దక్కపోవడంతో అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలోనే ఆయన ప్రజలకు చేరువ అయ్యారు. 2014 నాటికి వైసీపీ తరఫున వంశీ మరో మారు ఢీ కొట్టారు. అయినా వెలగపూడి బంపర్ మెజారిటీ సాధించారు. ఏపీలోనే రెండవ అతి పెద్ద మెజారిటీగా 47,883 ఓట్లతో విక్టరీ సాధించారు. ఇపుడు ముచ్చటగా మూడవమారు పోటీ చేసిన వెలగపూడికి గెలుపు సునాయసమని అంతా భావించారు. అయితే చివరి రోజుల్లో పరిస్థితి మారి టైట్ ఫీట్ ఇక్కడ జరిగిందని తెలుస్తోంది.పోలింగ్ అనంతరం తక్కువ మెజారిటీతో వెలగపూడి బయటపడతారని అంతా అనుకున్నారు. 


వెలగపూడికి బెర్త్ ఖాయమేనా

అంచనాలు అలాగే వచ్చాయి. అయితే పోలింగునకు, కౌంటింగునకు మధ్య నెలన్నర రోజులు వ్యవధి ఉండడంతో మెల్లగా పోలింగ్ సరళిపై అసలు నిజాలు బయటకు వస్తున్నాయనంటున్నారు. వెలగపూడి విజయం మొదట్లో అనుకున్నంత సులువు కాదని టీడీపీ శిబిరంలో ఇపుడు మెల్లగా టాక్ వినిపిస్తోంది. వైసీపీ నుంచి చివరి నిముషంలో బరిలోకి దిగిన అక్రమాని విజయనిర్మల బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. ఆమె భర్త యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ రెండు కులాలు విశాఖ తూర్పులో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. యాదవులు 55 వేల పై చిలుకు ఉంటే, బ్రాహ్మణులు పాతిక వేల దాకా ఉన్నారు. ఈ రెండూ కలిపితే వైసీపీకి దూసుకుపోయే పరిస్థితి ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు వైసీపీ అభ్యర్ధిని కైవశం చేసుకున్నా కూడా విజయ తీరాలకు చేరిపోతారని ఆ పార్టీ వారు లెక్కలేసుకుంటున్నారు. 48 వేల పై చిలుకు మెజారిటీ వచ్చిన వెలగపూడి ప్రతిపక్షంలో హిట్ అయ్యారు. అయిదేళ్ళ అధికార పాలనలో మాత్రం చాలా వ్యతిరేకత మూటకట్టుకున్నారు. దీనికి కారణం ఏకపక్షంగా పార్టీ సానుభూతిపరులనే పట్టించుకోవడం, ఓట్లు వేసి గెలిపించిన మెజారిటీ వర్గాలను పక్కన పెట్టడంతోనే వెలగపూడికి ఈసారి ఎదురుగాలి వీచిందని అంటున్నారు. ప్రధానంగా గతంలో ఓట్లేసి గెలిపించిన ప్రాంతాలు, వర్గాలు ఈసారి రివర్స్ అయ్యారు. ఇక ఎపుడూ టీడీపీకే జై కొట్టే మత్య్సకార వర్గాలలో ఈసారి భారీ చీలిక వచ్చిందని అంటున్నారు. వెలగపూడి మెజారిటీని పెంచే ఈ వర్గాలు చేజారడంతో ఇపుడు గెలుపే డౌట్లో పడిందని అంటున్నారు. వైసీపీ వైపు ఈ వర్గాలు మొగ్గు చూపడంతో టీడీపీలో గుబులు బయల్దేరింది. వైసీపీ అభ్యర్ధిని విజయనిర్మల గట్టిగా ప్రచారం చేయడం, ఎపుడూ టీడీపీకే ఓటు వేశాం, ఈసారి వైసీపీ వైపు చూద్దామనుకున్న వారంతా ఫ్యాన్ నీడన చేరడంతో టీడీపీకి విజయం దక్కుతుందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న వెలగపూడి ఆశలు ఎంతవరకూ నెరవేరతాయో 23న వెలువడే ఫలితాలలోనే తేలాలి.