అనంతపురం, మే 1, (way2newstv.com)
పాపం…గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే కోర్టు తీర్పుతో ఆయన నెల రోజులు ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. నాలుగున్నరేళ్లకు పైగా ఉన్న ఎమ్మెల్యే మాజీ అయితే, న్యాయస్థానంలో పోరాడి నెలరోజుల పాటు ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టం ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో వింత పరిస్థితి. ఐదేళ్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు. ఒకరు 2014 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేకాగా, నాలుగున్నరేళ్ల తర్వాత కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి మరొకరు. ఇలా ఇద్దరిపై నియోజకవర్గంలో సానుభూతి ఉంది.అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కె.ఈరన్న, ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పేస్వామిని ఓడించారు. ఓడించడం అంటే మామూలుగా కాదు. దాదాపు పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో మడకశిర నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. అయితే టీడీపీ గుర్తు మీద గెలిచిన ఈరన్న అఫడవిట్ లో తప్పుడు సమాచారమిచ్చారని, ఆయన భార్య ప్రభుత్వోద్యోగి అన్న విషయాన్ని దాచిపెట్ఠారని తిప్పేస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తిప్పేస్వామికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నెల ఎమ్మెల్యే కు సింపతి వర్క్ అవుటుందా
సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో నాలుగున్నరేళ్లుగా ఉన్న ఈరన్న పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.అయితే ఈనెల 11వతేదీన జరిగిన ఎన్నికల్లోనూ వీరిద్దరే మరోసారి తలపడ్డారు. టీడీపీ, వైసీపీ రెండూ వారికే టిక్కెట్లు ఇవ్వడంతో పోటీ రసవత్తరంగా మారింది. నాలుగున్నరేళ్లు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపనులు గెలిపిస్తాయని ఈరన్న భావిస్తున్నారు. న్యాయస్థానం తీర్పుతో తనకు సానుభూతి వచ్చిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. వైసీపీ అభ్యర్థి తప్పేస్వామి ఓడిపోయానన్న అక్కసుతో తనపై న్యాయస్థానం లో కేసు వేశారని ప్రచారం విస్తృతంగా చేశారు. దీనితో పాటు పసుపుకుంకుమ, సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని, మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని, మెజారిటీ కూడా గతం కంటే పెరుగుతుందని ఈరన్న ధీమాగా ఉన్నారు.వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి కూడా సానుభూతి అస్త్రాన్నే ప్రయోగించారు. తప్పుడు పత్రాలు సమర్పించి తనను ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా లేకుండా చేశారని తిప్పేస్వామి ప్రచారం చేశారు. ఈసారి తనకు ఒక ఛాన్సివ్వమని కోరారు. అంతేకాకుండా జగన్ వేవ్ ఈసారి తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో తిప్పేస్వామి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న లుకలుకలు కూడా గట్టెక్కిస్తాయంటున్నారు. ఐదేళ్లుగా తాను ఎమ్మెల్యేగా లేకున్నా ప్రజలతో కలసిపోయానంటున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఈసారి తన గెలుపునకు కృషి చేసిందని తిప్పేస్వామి చెబుతున్నారు. మొత్తం మీద నెల రోజుల ఎమ్మెల్యే ఈసారి ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా కానున్నారా? లేదా? లేదా? అన్నది మే 23వ తేదీన తేలిపోనుంది.