జగన్ మార్పు వెనుక నాడీ జ్యోతిష్యమేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ మార్పు వెనుక నాడీ జ్యోతిష్యమేనా

హైద్రాబాద్, మే 18, (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. గత ఎనిమిదేళ్లుగా లోటస్ పాండ్ ను వదిలి రాని జగన్ ఉన్నట్లుండి పార్టీ కార్యాలయాన్ని, తన నివాసాన్ని అమరావతికి మారుస్తుండటాన్ని పార్టీ నేతలు సయితం నమ్మలేకపోతున్నారు. గతంలో ఎన్నోసార్లు విజయవాడకు మకాం మార్చాలని చెప్పినా వినని జగన్, ఎన్నికల ఫలితాలకు ముందు పార్టీ కార్యాలయాన్ని మార్చడంపై క్యాడర్ లో కూడా గుసగుసలు విన్పిస్తున్నాయి.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జగన్ పార్టీని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి లోటస్ పాండ్ అంటేనే వైసీపీ. వైసీపీ అంటేనే లోటస్ పాండ్. గత ఎన్నికల తర్వాత ఏపీకి పార్టీ కార్యాలయాన్ని మారుస్తారని భావించినా జగన్ ఆ పని చేయలేదు. ఎన్నికల ముందు పార్టీ కార్యాలయాన్ని అమరావతిలో ప్రారంభించినా అక్కడి నుంచి కార్యకలాపాలు చేయలేదు. 


జగన్ మార్పు వెనుక నాడీ జ్యోతిష్యమేనా

అంతేకాదు ప్రచారంలో కూడా లోటస్ పాండ్ నుంచి వెళ్లి రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సయితం జగన్ కు ఏపీ రావడం ఇష్టం లేదని పలుసార్లు విమర్శలు చేసినా జగన్ మాత్రం ఆ విమర్శలపై పెదవి విప్పలేదు. అయితే తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు నివాసాన్ని కూడా అమరావతికి మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో నిజంగా సంచలనమే. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా ముఖ్యనేతలు పార్టీలో చేరాలంటే హైదరాబాద్ కు రావాల్సిన పరిస్థితి. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం లోటస్ పాండ్ నుంచే ఈ ఎనిమిదేళ్లు రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. ఇప్పుడు మార్చడం వెనక జగన్ ఆలోచన ఏంటన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే విన్పిస్తుండటం విశేషం. తాము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామన్న ధీమాతోనే జగన్ నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నది పార్టీ వర్గా లనుంచి విన్పిస్తున్న టాక్. కొన్ని జాతీయ ఛానెళ్లు, ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు జగన్ పార్టీ గెలుపు ఖాయమని తేల్చడంతోనే ఆయన మకాం బెజవాడకు మార్చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మరి ఫలితాల్లో తేడా ఏదైనా వస్తే…?? ఈ ప్రశ్నకు మాత్రం వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు.