మూడున్నర దశాబ్దాల వామపక్షాల కోటను చిత్తు చేసినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ అంటేనే మమతా బెనర్జీ అన్న పేరు మారుమోగిపోయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే కాదు, మళ్లీ వామపక్షాలకు పశ్చిమ బెంగాల్‌లో నిలదొక్కుకునే పరిస్థితే లేకుండా పోయింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మమత ఆశలకు బీటలు పడ్డాయి. ఆమె కంచుకోట కాస్తా కదిలిపోయింది. దేశ వ్యాప్తంగా విజయం దుందుభి మోగించిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లోనూ ప్రభంజనానే్న సృష్టించారు. అనూహ్యమైన రీతిలో అధిక స్థాయిలోనే లోక్‌సభ స్థానాలు సంతరించుకొని రెండంకెల సంఖ్యను అధిగమించారు. అంతేకాదు, మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగేలేదన్న స్థానాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.
దీదీ...సెల్ఫ్ గోల్
2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే రాష్ట్రంలో పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో మమత ఆశలను పటాపంచలు చేస్తూ దూసుకుపోయింది. 42 సీట్లు గల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈ రకమైన పట్టును సంపాదించడం మమతా బెనర్జీ ఆధిపత్యానికి పెనుసవాలేనన్న సంకేతాలను అందించింది. అంతేకాదు, బీజేపీ ఓట్ల శాతం పరగడమే కాదు, గతంలో మమతకు లభించిన ఓట్లు తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఏడు దశల లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిందో అప్పటి నుంచీ కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాది మమత కంచుకోటను బద్ధలు కొట్టాలన్న ధ్యేయమే. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు అనేక సార్లు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి రోడ్ షోలు, ఎన్నికల సభలు నిర్వహించడం వెనక అసలు ఉద్దేశం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి కనీస పక్షంగా సీట్లను సంపాదించిపెట్టాలన్న ఆలోచనే. ఈ ఏడు దశల ఎన్నికల్లో ఎక్కడా లేనంతగా బెంగాల్‌లో హింస చెలరేగినా బీజేపీ మాత్రం తన పట్టు బిగించగలిగింది. మమతకు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తథ్యమని మోదీ అంటే ఇక ఆయనకు ప్రధాని పదవి అధిరోహించే కాలం తీరిపోయిందంటూ దీదీ ధ్వజమెత్తారు. ఇలా పరస్పర ఎదురుదాడులతో సాగిన ఎన్నికల ప్రచారం అంతిమంగా మమతా బెనర్జీకి నిరాశ మిగిలిస్తే, బీజేపీకి మాత్రం సరికొత్త ఆశలు చిగురింపజేసింది. మమతా బెనర్జీ కోటలో బీజేపీ పాగా వేయడానికి దారితీసిన అంశాల్లో ఆమె అనుసరించిన వ్యూహాత్మక తప్పిదమే. హిందువుల ప్రయోజనాలను విస్మరించి మైనార్జీ ఓట్లను ఆకట్టుకోవడానికే మమత ప్రాధాన్యత ఇచ్చారని, దాని కారణంగానే బీజేపీ చాలా బలీయంగానే రాష్ట్రంలో పుంజుకుందని చెబుతున్నారు