నత్తనడకన(కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నత్తనడకన(కర్నూలు)

కర్నూలు, మే28 (way2newstv.com): 
అన్నదాతలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. కాలువల ఆధునికీకరణ పనులకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏళ్లు గడిచినా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. చివరికి పనులన్నీ నత్తనడకన సాగుతుండడంతో ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అంచనా వ్యయం పెరిగిపోతుండడంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. అక్కడక్కడా జరుగుతున్న పనుల్లోనూ నాణ్యత లోపిస్తోంది. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కరవైంది.తుంగభద్ర దిగువ కాలువ పరిధిలో ఆధునికీకరణ పనుల కోసం ప్రభుత్వం 7.2.2008లో రూ.179 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని 18 ప్యాకేజీలుగా విభజించగా గుత్తేదారులు పనులను దక్కించుకున్నారు. 

నత్తనడకన(కర్నూలు)

సగానికిపైగా పూర్తి చేసి మిగిలిన వాటిని వదిలేశారు. ఇందులో 6 ప్యాకేజీలు పూర్తి చేయగా మిగిలిన వాటిలో కొన్నింటిని మాత్రమే చేపట్టి రూ.128 కోట్లు ఖర్చు చేశారు. 12వ ప్యాకేజీ పనులను సగమే చేసి అసంపూర్తిగా వదిలేశారు. ఫలితంగా వీటిని రద్దు చేయాలని కోరుతూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కాలువ సీసీ లైనింగ్, వంతెనలు, ఇతర డిస్ట్రిబ్యూటరీల కోసం ప్యాకేజీ నంబరు 4ఎ కింద రూ.8.13 కోట్లతో గుత్తేదారులు తిరిగి పనులు దక్కించుకున్నారు. ప్యాకేజీ నంబరు టీబీపీ ఎల్లెల్సీ ప్రధాన కాలువ 292.400 కి.మీ. నుంచి 299 కి.మీ. వరకు రూ.8,13,60,399 విలువైన పనులకు సంబంధించి 19.02.2010లో టెండర్లు పిలిచారు. దీనిని హైదరాబాదుకు చెందిన జీఎస్‌ కంపెనీ ఎక్సెస్‌ 3.51 శాతంతో దక్కించుకుంది. 5.10.2012లోపు పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు. 24 నెలల్లో పూర్తి చేసి సాగునీరు పారేలా చూడాలన్నది లక్ష్యం. సంబంధిత కంపెనీ స్పందించకపోవడంతో మూడు సార్లు ఈవోటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి వీటిని సైతం అధికారులు రద్దు చేసి ఎస్టిమేషన్లు వేసి కొత్తగా ఇదే పనికి టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ప్రధాన కాలువ పొడవునా ఆధునికీకరణ పనుల కోసం రూ.42.12 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించి టెండర్లను 26.12.2018న పిలిచారు. కడపకు చెందిన ఎంఆర్‌జీఆర్‌ కంపెనీ (రామగోవిందరెడ్డి) 3.89 శాతం ఎక్సెస్‌కు దక్కించుకుంది. పనుల వర్క్‌ ఆర్డర్‌ను అధికారులు 11.3.2019న జారీ చేశారు. 24 నెలల్లో పూర్తి చేయాలని షరతు విధించారు.తుంగభద్ర దిగువ కాలువ మరమ్మతులకు సంబంధించి గట్టు బలహీనంగా ఉన్నచోట సైడ్‌వాల్స్‌ను నిర్మిసారు. 2.6 మీటర్ల ఎత్తుతో వీటిని ఏర్పాటుచేస్తారు. రెండు గోడల మధ్య అడుగు మందంతో సీసీతో గోడలు నిర్మిస్తారు. కాలువ పొడవునా 2.6 కి.మీ. మేరకు సైడ్‌వాల్స్‌ సిద్ధం చేస్తారు. కాలువ పొడవునా సీసీ లైనింగ్‌ లేకుండా రాతి పరుపుతో పనులు చేపడతారు. 30 సెంటీమీటర్ల రాయిని కాలువ ఇరువైపులా గట్లకు రాతి పరుపు పరిచి వాటికి సిమెంటుతో ప్లాస్టింగ్‌ చేస్తారు. ఈ పనులన్నీ పూర్తిస్థాయిలో జరిగితే అన్నదాతల కష్టాలు తీరుతాయి.