కొణతాలకు కనిపించని దారి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొణతాలకు కనిపించని దారి...


విశాఖపట్టణం, మే 31, (way2newstv.com)
రాజకీయాల్లో ఎలా జరుగుతుందో ముందే మనం ఊహించలేం. అయితే పొలిటికల్ లీడర్స్ మాత్రం పీపుల్ పల్స్ పడతారన్నది మాత్రం నిజం. అందుకే చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా సాగాయి. అయితే సీనియర్ నేత అయిన కొణతాల రామకృష్ణ మాత్రం పల్స్ ను పసిగట్ట లేకపోయారు. ఫలితంగా చతికల పడ్డారు. దశాబ్దకాలం పాటు పదవులకు దూరంగా ఉన్న కొణతాల మరో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొణతాల ఆకస్మిక నిర్ణయాలు కొంపముంచేవిగా ఉన్నాయని ఆయన అనుచరులు కూడా ఆవేదన చెందుతున్నారు.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరుగులేని నేత. ఆయన సున్నిత మనస్కుడిగా, నిజాయితీ పరుడిగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను ఏరికోరి తన టీంలో చేర్చుకుంది అందుకే. కొణతాల రామకృష్ణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు


కొణతాలకు కనిపించని దారి...
అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి కొణతాలను పార్టీని వీడేలా చేసింది. ఆ ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం, ఆమె విజయానికి కొణతాల కృషి చేయాలేదన్న పార్టీ నేతల సూటిపోటి మాటల కారణంగా ఆయన పార్టీని వీడారు.వైసీపీని వీడినా ఆయన ఐదేళ్ల పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన అన్ని పార్టీల అధినేతలను కలిసి ఉత్తరాంధ్ర సమస్యలను తమ మ్యానిఫేస్టోలో చేర్చాలని అభ్యర్థించారు. జగన్,చంద్రబాబులను కూడా ప్రత్యేకంగా కలిశారు. అయితే ఆయనను పార్టీలో చేరమని తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన వత్తిడి వచ్చినా ఆయన చేరలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వైసీపీలో చేరాలా? టీడీపీలో చేరాలా? అన్నదానిపై ఊగిసలాటలాడారు. అనుచరులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనుచరులంతా జగన్ పార్టీకి వెళ్లమని సూచించారు.దీంతో వైసీపీలోకి చేరేందుకు సిద్ధమైన కొణతాల జగన్ ను కలిశారు. అయితే టిక్కెట్ విషయంలోనూ, మరే విషయంలోనూ జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పినా కాదన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన గట్టిగానే ప్రచారం చేశారు. అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. అయినా రెండు స్థానాల్లోనూ టీడీపీ గెలుపునకు నోచుకోలేదు. దీంతో కొణతాల రామకృష్ణ మరో ఐదేళ్లు పాటు వెయిట్ చేయాల్సిందే. ఆయన అనుచరులు మాత్రం తమ నేత రాంగ్ స్టెప్ వేశారంటున్నారు.