జూలై 1న ప్రజాదర్బార్‌ కార్యక్రమం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూలై 1న ప్రజాదర్బార్‌ కార్యక్రమం


అమరావతి, జూన్ 29, (way2newstv.com)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం(సీఎంవో) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి జగన్‌ తరచుగా సామాన్య ప్రజలను కలుస్తూనే ఉన్నారు. అయితే, ఒక క్రమపద్ధతిలో ఈ కలయికలు జరుగలేదు. అందువల్ల తానే స్వయంగా ప్రజానీకాన్ని కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను తలపెట్టారు. 

జూలై 1న ప్రజాదర్బార్‌ కార్యక్రమం

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకూ అదే బాటను అనుసరించే యత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలను ప్రతిరోజూ ఒక గంట పాటు కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. జగన్‌ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఓ వైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఒక షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు, నివేదనలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు.