బీజేపీలో నెంబర్ 2 గా షా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీలో నెంబర్ 2 గా షా


న్యూఢిల్లీ, జూన్ 7, (way2newstv.com)
లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు కొలువు దీరిన కేంద్ర సర్కార్‌లో.. తన తర్వాత స్థానం అత్యంత విశ్వసనీయమైన తన అనుచరుడు అమిత్‌షాదేనని క్యాబినెట్ కమిటీల నియామకం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వరుసగా ఎనిమిది అత్యంత కీలకమైన క్యాబినెట్ కమిటీలను మోదీ ఏర్పాటు చేశారు. వీటన్నింటిలోనూ హోంమంత్రి అమిత్‌షాకు స్థానం లభించింది. వసతి ఏర్పాటు కమిటీ సారథ్య బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. మరోవైపు, తొలుత రెండు కమిటీల్లోనే రాజ్‌నాథ్‌కు స్థానం కల్పించిన మోదీ, అనంతరం జాబితాను సవరించి మరో నాలుగు కమిటీల్లో ఆయనకు చోటునిచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గానికి రాజ్‌నాథే నేతృత్వం వహించనున్నారుఆర్థిక వ్యవహారాలు, పార్లమెంట్ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, నియామకాలు, వసతి అంశాలకు సంబంధించి ఐదు మంత్రివర్గ సంఘాలను కేంద్రం  నియమించింది. పెట్టుబడులు-ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన-నైపుణ్యాభివృద్ధిపై  మంత్రివర్గ సంఘాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలపై క్యాబినెట్ కమిటీలు ఏర్పాటుకావడం బహుశా ఇదే మొదటిసారి. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం కూడా బుధవారమే ఏర్పాటైనట్లుగా  వెల్లడైంది.


బీజేపీలో నెంబర్ 2 గా షా
క్యాబినెట్ కమిటీల్లో అమిత్ షాకు అమిత ప్రాధాన్యం ఇచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. గతంలో మాదిరే ఈసారి కూడా మంత్రిత్వ శాఖల ప్రాధాన్యాన్ని అనుసరించి మంత్రివర్గ సంఘాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ కూడా అన్ని సంఘాల్లో సభ్యుడిగా ఉండేవారని పేర్కొంటున్నాయి. సీతారామన్‌కు ముందు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించిన అరుణ్‌జైట్లీ కూడా అన్ని కమిటీల్లో సభ్యులుగా ఉండేవారు. అనారోగ్య కారణాల రీత్యా ఈసారి ఆయన మంత్రివర్గంలో చేరలేదు. తాజా క్యాబినెట్ కమిటీల్లో అమిత్ షా తర్వాత నిర్మలా సీతారామన్ ఎక్కువ (7) కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో రాజ్‌నాథ్(6) ఉన్నారు.

1.ఆర్థిక వ్యవహారాలు
అత్యంత కీలకమై ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్‌షా, రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సభ్యులుగా ఉంటారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, వాణిజ్యం, రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. 
2.పార్లమెంట్ వ్యవహారాలు
పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై సూచనలు అందించే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి రాజ్‌నాథ్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో షా, నిర్మలా సీతారామన్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, నరేంద్రసింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి సభ్యులుగా ఉంటారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రులు అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురళీధరన్ ప్రత్యేక ఆహ్వానితులు.
3.రాజకీయ వ్యవహారాలు
కీలక విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి సూచనలు అందించే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి ప్రధాని మోదీ సారథ్యం వహిస్తారు. ఈ కమిటీలో రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, సీతారామన్, గోయల్, పాశ్వాన్, తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్, వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్, ప్రహ్లాద్ జోషి ఇతర సభ్యులు. 
4.నియామకాలు
ఈ సంఘానికి ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు. హోం మంత్రి అమిత్ షా మరో సభ్యుడిగా ఉంటారు. 
5. వసతి ఏర్పాటు
అమిత్ షా సారథ్యంలో ఏర్పాటైన వసతి (అకామిడేషన్) క్యాబినెట్ కమిటీలో నితిన్ గడ్కరీ, సీతారామన్, పీయుష్ గోయల్ సభ్యులుగా ఉంటారు. పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్, గృహ, పట్టణ వ్యవహారాల, విమానయాన శాఖల మంత్రి హర్ద్దీప్ సింగ్ పురి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
6.భద్రతా వ్యవహారాలు
కీలకమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, జైశంకర్, నిర్మలా సీతారామన్ ఇతర సభ్యులు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలను ఈ సంఘం పర్యేవేక్షిస్తుంది. 
7.పెట్టుబడులు- ఆర్థికాభివృద్ధి
దీనికి ప్రధాని మోదీ సారథ్యం వహిస్తారు. రాజ్‌నాథ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయెల్ సభ్యులుగా ఉంటారు. 
8. ఉద్యోగాల కల్పన-నైపుణ్యాభివృద్ధి
ప్రధాని మోదీ నేతృత్వం వహించే ఈ మంత్రివర్గ సంఘంలో రాజ్‌నాథ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర సింగ్ తోమర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే, కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పురి సభ్యులుగా ఉంటారు.