అనంతపురం జిల్లాలో మొత్తం 5,137 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు 5,78,791 మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు. 40 శాతం పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు ఉన్నాయి. క్రీడామైదానాలు ఉన్నవాటిలో కూడా 20 శాతం పాఠశాలల్లో మాత్రమే ఆటలు ఆడించే పీఈటీలు ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 246 పాఠశాలలు ఉండగా వాటిలో 20 వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,274 ప్రైవేటు పాఠశాలలకు గాను 10 శాతం పాఠశాలలకు క్రీడామైదానాలు లేవంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆయా పాఠశాలల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు.
40 శాతం స్కూళ్లకు మైదానాల్లేవు
మిగిలిన వాటిలో ప్రైవేటు పీఈటీలు ఉండగా, వారు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులను క్యూలో నిల్చోబెట్టడం, ప్రాంగణంలో విద్యార్థులు అల్లరి చేయకుండా చూడడానికే తప్ప వారితో ఆటలు ఆడించిన దాఖలాలు లేవు.బత్తలపల్లి మండలంలో మొత్తం 43 పాఠశాలలు ఉండగా వాటిలో మూడు పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు, పీఈటీల సౌకర్యం ఉంది. మిగిలిన అన్నింటీలోనూ ఆటస్థలాలు లేవు. ధర్మవరం పట్టణ, మండల పరిధిలో మొత్తం 122 పాఠశాలలు ఉండగా వాటిలో 20 పాఠశాలలకు మాత్రమే క్రీడామైదానాలు ఉన్నాయి. వాటిలో కూడా 10 పాఠశాలల్లో మాత్రమే పీఈటీలు ఉన్నారు. ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో 64 పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.గ్రామీణ యువతను క్రీడలపై ఆసక్తి పెంపొందించి వారిలో నైపుణ్యం వెలికి తీసేందుకు పైకాలో భాగంగా ప్రతి మండల కేంద్రంలోనూ రూ.2కోట్లతో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అయితే స్థల సేకరణ, ఇతరత్రా కారణాలతో ఆ ప్రకటన మరుగున పడిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ మినీ స్టేడియాల గురించే ఆలోచించలేదు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలల్లో అయితే నిరంతరం బట్టీలు పట్టించేందుకు ఈ పీఈటీలను వినియోగించుకుంటున్నారు కానీ, వారితో ఏనాడూ ఒక్క ఆట ఆడించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తికాదు. ఇక ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 100కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 10 పాఠశాలలకు మించి క్రీడామైదానాలు లేవంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా పట్టణంలో నారాయణ, భాష్యం, రవీంద్రభారతి, శ్రీచైతన్య తదితర కార్పొరేట్ సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేశాయి. అయితే వాటిలో ఏ ఒక్క పాఠశాలకు కూడా క్రీడామైదానం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.