కొనసీమలో మరో కాలుష్య పరిశ్రమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనసీమలో మరో కాలుష్య పరిశ్రమ


కాకినాడ, జూన్ 9, (way2newstv.com)
కొబ్బరి, జీడి, మామిడి తోటలు, వరి, చెరకు వంటి పంటలకు నిలయమై, మినీ కోనసీమగా పేరుగాంచిన నక్కపల్లి మండలంలో ఇప్పటికే ఉన్న కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే చేపల చెరువుతోభూగర్భ జలాలు కలుషితమైతే ఆ నీటిని తాగే ప్రజలు రోగాల బారిన పడనున్నారు. హెటిరో పరిశ్రమ ఏర్పాటు కానున్న ప్రాంతానికి ఆనుకొని కొబ్బరి, జీడి, మామిడి తోటలతో పాటు పచ్చని పొలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మినీ కోనసీమగా పిలుస్తారు. బోర్లు తవ్వించుకొని తోటలను పెంచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతో ఈ ప్రాంత రైతులు జీవిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే వచ్చే కాలుష్యానికి ఈ తోటలు దెబ్బతింటాయని, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారుమండలంలోని డిఎల్‌.పురం సర్వే నెంబర్‌ 3, 4, 5, 9 నుండి 14 వరకు 70.4 ఎకరాల జిరాయితీ భూమిలో మెసర్స్‌ బిఎస్‌జి కెమికల్స్‌ అండ్‌ ఫార్మా స్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు విశాఖపట్నం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. కొనసీమలో మరో కాలుష్య పరిశ్రమ
రూ.15.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ నెలకు 50 టన్నుల సామర్థ్యం గల బహుళ ఔషధాలు, ఔషధ ఇంటర్మీడియట్స్‌, బహుళ ప్రయోజన రసాయనాలు, కస్టమ్‌ సింథసిస్‌, ఆర్‌ అండ్‌ డి తదితర ఉత్పత్తులు చేయనుంది. రోజుకు 121.5 కిలో లీటర్ల నీటి అవసరం ఉంటుందని, వర్షపు నీటిని శుభ్రపరిచి ఉపయోగించుకోవడం వల్ల 65.0 కిలో లీటర్లకు తగ్గించడం జరుగుతుందని, వర్షపు నీటిని సేకరించి నిలువ చేసి ఉపయోగించడం జరుగుతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 71.1 కిలో లీటర్ల వ్యర్థ నీరు వెలువడుతుందని, ఆధునిక సాంకేతిక యంత్రాలను ఉపయోగించి వ్యర్థ జలాలను శుభ్ర పరిచి తిరిగి వాడుకోనుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇది ఎంత వరుకు సాధ్యమని మేధావులు ప్రశ్నిస్తున్నారు.పరిశ్రమలు ఏర్పాటు చేయాడానికి ముందు యాజమాన్యాలు చెబుతున్నవి తరువాత పాటించడం లేదు. ఇక్కడ వర్షపు నీటిని నిల్వ చేయడం సాధ్యం కాకపోతే పెద్ద ఎత్తున బోర్లు తీస్తారు. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. చుట్టు పక్కల రైతుల బోర్లకు నీరందే పరిస్థితి ఉండదు. అలాగే వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఉపయోగిస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఇది అధిక మొత్తం ఖర్చుతో కూడికున్న పనికి కనుక భూమిలోకి ఇంకించడంగాని, సముద్రంలోకి వదిలేయడంగాని చేయొచ్చు. ప్రస్తుతం జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. పరవాడ ఫార్మా కంపెనీలు వ్యర్థ జలాలను వదిలేయడం వల్ల చుట్టూ ఉన్న చెరువులు, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. సముద్రంలో చేపలు కనుమరుగయ్యాయి.డిఎల్‌.పురం, నెల్లిపూడి, గునుపూడి, బంగారమ్మపేట, అమలాపురం, ఉద్దండపురం, వేంపాడు గ్రామాలకు అతి సమీపంలో ఈ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేస్తే దీని వల్ల వచ్చే వాయు, జల కాలుష్యం వల్ల ప్రజలు పూర్తిగా అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇటువంటి ఫార్మా కంపెనీలు ఉన్న పరవాడ ఫార్మా సిటీ, నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌, పాయకరావుపేట డెక్కన్‌ కంపెనీల చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారు. ఆ సమయంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. పరిశ్రమ పరిధిలో 10 గ్రామాలున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ పది గ్రామాల్లో సుమారు 25 వేలకు పైగా జనాభా ఉంది. పరిశ్రమ ఏర్పాటుకు కూసింత దూరంలో సముద్రతీరం ఉంది. డిఎల్‌.పురం వాడపేట, బంగారమ్మపేట మత్స్యకారులు సముద్రంలోకి చేపలు వేటకు వెళ్తూ ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల చేపలు మృత్యువాత పడతాయని, దీని వలన తమ ఉపాధి దెబ్బతింటుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యవసాయం, కూలి పనులు, వివిధ వృత్తులు చేసుకొని జీవిస్తున్న వారి మనుగడ ప్రశ్నార్థకం కానుంది.