కొత్త సచివాలయ భవనం కోసం సీఎం కేసీఆర్ రెండు నమూనాలను పరిశీలిస్తున్నారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గతంలో ఇచ్చిన ఓ నమూనాతోపాటు ఈ మధ్యనే చన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన మోడల్ కూడా సీఎం దృష్టిలో ఉన్నది. దీర్ఘ చతురస్రాకారంలో ఒకే బ్లాక్‌గా, పొడవుగా కనిపించేలా చన్నై కంపెనీ ఇచ్చిన నమూనాతోపాటు భవనం ఎలివేషన్ కూడా సీఎంను బాగా ఆకట్టుకున్నదని అధికారులు చెప్తున్నారు. ఇండో- అరబిక్ ఆర్కిటెక్చర్‌తో హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన నమూనాను కూడా సీఎం పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఆయన ఖరారు చేస్తారు. గతవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
కొత్త సచివాలాయానికి వడివడిగా అడుగులు
నూతన శాసనసభ, సచివాలయ భవనాల నిర్మాణాలకు గ్లోబల్ టెండర్ల ద్వారా నిర్మాణ సంస్థను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ రెండు భవనాల నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. రెండు భవనాలకు ఈ నెల 27 న శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. లేక్ వ్యూ, పచ్చికబయళ్లు, ఫౌంటెయిన్లతో కొత్త భవన సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా పర్యావరణహిత వాతావరణాన్ని నెలకొల్పేవిధంగా నిర్మించాలని సీఎం అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం సచివాలయ ప్రాంగణంలోని ఈశాన్యం మూలలో, ఎర్రమంజిల్‌లోని పాత భవనం స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపనలు చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన చేసిన తర్వాత ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత వేగంగా ఈ రెండు భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే పాత సచివాలయంలోని సీఎంవో, జీఏడీతో సహా పలు ప్రభుత్వ శాఖలను పక్కనే ఉన్న బీఆర్కే భవనంలోకి తరలించడానికి సాధారణ పరిపాలనశాఖ కసరత్తు చేస్తున్నది. ఇది పూర్తయితే నూతన భవనాల నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయి.
Tags:
telangananews