నాలుగేళ్లలో విద్యుత్తు కోతలు బాగా తగ్గాయి. ఉత్పత్తి వ్యవస్థలు మెరుగుపడ్డాయి. కావాల్సినంత కరెంటు లభ్యమవుతోంది. సాంకేతికత అందిపుచ్చుకొని.. వివిధ రకాల లావాదేవీలన్నీ ఆన్‌లైన్, యాప్‌ల ద్వారానే అమలు చేస్తున్నారు. థర్మల్, హైడల్ విద్యుత్తు కాకుండా జిల్లాలోనూ సౌర విద్యుదుత్పత్తి యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 95.03 ఎండబ్ల్యూ(మెగా వాట్స్) విద్యుదుత్పత్తి చేయడానికి వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
పెరిగిన విద్యుత్ సరఫరా
చెరువుకొమ్ముపాలెంలో 1.03 ఎండబ్ల్యూ, తర్లుపాడులో 21 ఎండబ్ల్యూ ఉత్పత్తి జరుగుతోంది. బీ 40,032 కొత్త వ్యవసాయ సర్వీసులిచ్చారు. రూ.200 కోట్ల విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు రూ.277 కోట్లతో 182 కాలనీలకు విద్యుత్తు సదుపాయం కల్పించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన కింద రూ.55 కోట్లతో 73,921 కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.నవ్యాంధ్ర ఏర్పడక ముందు విద్యుత్తు కోటా లోటులో ఉండేది. నాడు నాలుగు లక్షల యూనిట్లు కొరత ఉండగా.. 10.735 ఎంయూ(మిలియన్ యూనిట్లు) తగ్గకుండా సరఫరా అవుతోంది.