వానలపైనే ఆశలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వానలపైనే ఆశలు


కర్నూలు, జూన్ 11, (way2newstv.com)
ఈ ఏడాదైనా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి అప్పుల ఊబిలో నుంచి గట్టెక్కేలని ఈ ఖరీఫ్‌పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా తాము చేసుకున్న అప్పులు, ఒక పక్క కుటుంబ పోషణకై రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతే రాజు అన్న నానుడి ఒకప్పటి మాట. రైతు పంట పండితేనే ప్రతి ఒక్కరికి అన్నం అనేది జగమెరిగిన సత్యం. రైతుకు ప్రస్తుతం సమాజంలో మర్యాద లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో ఆయన పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక పోతున్నారు. రైతు కోసం కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టిన గిట్టుబాటు ధరలేక మధ్య దళారుల చేతిలో మోసపోతున్నారు. మరోపక్క ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు తమ దగ్గర నిల్వ ఉండి అమ్ముడుపోని క్రిమిసంహారక మందులను మాయమాటలు చెప్పి రైతుకు అంటగడుతున్నారు. 


వానలపైనే  ఆశలు
రైతుకు ఎలాంటి మందు అవసరమో పంట పొలాలకు వెళ్లి పంటకు ఏ రోగం వచ్చిందో గుర్తించి ఆ మందు కొనాలని సూచించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉంది. వ్యవసాయ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటంతో డీలర్లకు ఇష్టారాజ్యంగా తయారయిందనే ఆరోపణలున్నాయి. గత రెండు సంవత్సరాలుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతన్నలకు ఏ పంట కూడా చేతికి రాలేదు. కుటుంబ పోషణ భారమై బెంగళూరు, హైదరాబాద్‌, ముంబాయి తదితర సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న కూడా వారికి తమ పంట పొలాలపై ఆశ పోవడం లేదు. అక్కడి నుంచి గ్రామాలకు చరవాణి ద్వారా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయా, ఈ ఏడాది ఏ పంటలు వేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రైతన్నలకు పంటలు పండించడంలో ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అర్థమవుతుంది. రైతులకు ఆసరాగా నిలవాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఏ పథకాలు ప్రవేశ పెట్టిన, పంట నష్టపరిహారమైనా పూర్తి స్థాయిలో నేటి వరకు అందడం లేదు. గత టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో పైకం జమ చేసింది. అది కూడా కొందరు రైతులకు అందితే మరికొంతమంది రైతులకు అందలేని పరిస్థితి. ప్రస్తుత వైసిసి ప్రభుత్వం అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో రైతుకు రూ.12,500 ఇస్తామని ప్రకటించింది. ఎంతమంది రైతులకు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రైతన్నలు మాత్రం మాకు ప్రభుత్వం అందించిన పరిహారం ఏ మూలన సరిపోదని, సమృద్ధిగా వర్షాలు కురిసి మంచిగా పంటలు పండితే మేము ఇంకొకరికి సహాయం చేసే స్థితికి ఎదుగుతామని పేర్కొంటున్నారు