కార్పొరేట్ స్టైల్ లో జెడ్పీ సంస్కృతోన్నత పాఠశాల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కార్పొరేట్ స్టైల్ లో జెడ్పీ సంస్కృతోన్నత పాఠశాల


విజయవాడ, జూన్ 11, (way2newstv.com)
నాట్యక్షేత్రం, జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తించబడిన మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్దేంద్ర జెడ్పీ సంస్కృతోన్నత పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. 1962లో కూచిపూడి నాట్యాచార్యులు ఈ గ్రామంలో కూచిపూడి నాట్యాన్ని నేర్పేందుకు ఏర్పాటు చేసిన శ్రీ సిద్దేంద్రయోగి కూచిపూడి కళాక్షేత్రానికి అనుబంధంగా 1962లో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. తదుపరి 1986లో ఈ పాఠశాల జిల్లా పరిషత్ స్వాధీనం చేసుకుని అభివృద్ధి మాత్రం నామమాత్రం నిర్వహించారు. దాతల సహకారంతో పూరిపాకలో విద్యాభ్యాసం కొనసాగింది. ఈ నేపథ్యంలో గత జిల్లా పరిషత్ చైర్మన్.. చొరవతో ఆరు తరగతి గదుల నిర్మాణం జరిగింది. తదుపరి ఈ పాఠశాలలో 2016లో కూచిపూడి గ్రామాన్ని దత్తతతీసుకున్న సిలీకానాంధ్ర వసుధైక కుటుంబం ఆర్థిక సహకారంతో లక్షలాది రూపాయల వ్యయంతో అప్పటికే నిర్మించబడిన ఆరు తరగతి గదులతో పాటు ప్రభుత్వ నిధులతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులు మొత్తం కార్పొరేట్ పాఠశాలను తలదనే్న విధంగా డిజిటల్ లైట్లు, ఆధునిక ప్లోరింగ్ తదితర హంగులతో తీర్చిదిద్దారు. 


కార్పొరేట్ స్టైల్ లో జెడ్పీ సంస్కృతోన్నత పాఠశాల
ఈ నేపథ్యంలో ప్రధానోపాద్యాయులుగా నియమితులైన కొల్లి సత్యజగదీశ్వరరావు కృషి, చొరవతో అధ్వాన్నంగా ఉన్న మరుగుదొడ్లు, టాయిలెట్లను కూచిపూడి రోటరీ క్లబ్, సిలీకానాంధ్ర వసుదైక కుటుంబం సహకారంతో మరింతగా అభివృద్ధి చేశారు. గత నాలుగు సంవత్సరాలు నుండి 10వ తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గత ఏడాది ప్రధానోపాధ్యాయుల చొరవతో భాషా, సాంస్కృతిక ఉపాధ్యాయులు నిరంజనరావు, దివంగత సంస్కృత ఉపాధ్యాయులు రామన్న కృషితో భాషా, సాంస్కృతిక తరగతి గదిని, అలాగే ఉపాధ్యాయులు లక్ష్మీకుమారి, నాగలక్ష్మి సహకారంతో సైన్స్ తరగతి గదిని, ఉపాధ్యాయుడు దాసరి వెంకటరత్నం, పాగోలు రమేష్‌బాబు సహకారంతో సాంఘిక శాస్త్రం గదులను ఏర్పాటు చేసి దృశ్య శ్రవణ బోధన కొనసాగించారు. దీంతో జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత సుందరమైన, ఆధునీకరణమైన పాఠశాలగా శ్రీ సిద్దేంద్రయోగి జెడ్పీ ఓరియంటల్ పాఠశాల రూపొందింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు అన్న నినాదానికి అనుగుణం, మొవ్వ, పమిడిముక్కల, ఘంటసాల తదితర మండలాల్లోని తల్లిదండ్రులు ఈ పాఠశాలల్లో సంస్కృత భాషను చిన్ననాటి నుండే నేర్పించేందుకు పాఠశాలలో చేర్పించాలని విద్యాకుటుంబం కోరుతోంది. దూర ప్రాంతాలు నుండి తరలి వచ్చే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్స్ ఈ పాఠశాల సమీపంలో ఉండటంతో విద్యతో పాటు తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆర్చి, గేటును నిర్మించటం ముదావహం