మన కాశ్మీర్ కి ఆదరణేదీ...? (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మన కాశ్మీర్ కి ఆదరణేదీ...? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూన్ 3 (way2newstv.com): 
అందాల కశ్మీర్‌గా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఆదరణ కరవైంది. సుందరమైన పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధుల ఆటంకం కలుగుతోంది. స్వదేశీ దర్శన్‌ పేరుతో కేంద్రప్రభుత్వం పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని భావించినా.. అది ప్రకటనలకే పరిమితమైంది. ప్రజాప్రతినిధుల మాటలు వట్టి మూటలుగా మిగిలిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చారిత్రక వైభవం కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఆరేళ్లు గడిచినా.. అవి కార్యరూపం దాల్చలేదు.అడవుల ఖిల్లాగా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రకృతి సంపదకు కొదవలేదు. విస్తారమైన అడవులు, అందమైన జలపాతాలు, సుందరమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలకు నిలయంగా మారింది. ప్రకృతి సంపాదిత వరమే కాని.. పాలకులు చేసిన అభివృద్ధి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చారిత్రక వైభవం కలిగిన ప్రదేశాలు అనేకమున్నాయి. వీటి వద్ద కనీస మౌలిక వసతులతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని భావించారు. కేంద్రప్రభుత్వం ఇందుకు సానుకూలంగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన అధికారులు పది ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. 

మన కాశ్మీర్ కి ఆదరణేదీ...? (ఆదిలాబాద్)

వీటి వద్ద ఏర్పాటు చేయాల్సిన పనుల వివరాలతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు 2013-14 ఏడాదిలో రూ.7210కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ ఇప్పటివరకు అవి ప్రాతిపాదనలకే పరిమితమయ్యాయి. ఇక్కడికి వచ్చిన పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరొచ్చినా.. ముందుగా ఇక్కడి ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని హామీలిస్తున్నారు. కానీ అవి కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఫలితంగా మౌలిక వసతులు లేక సందర్శకులు అవస్థలు పడాల్సి వస్తోంది. అటు కేంద్రప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టిసారించడం లేదు.దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయంలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు రూ.440 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇక్కడ ఉన్న హరిత హోటల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సమాచార కేంద్రం, సావనీర్‌షాప్‌, పార్కింగ్‌ ప్రాంతాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంలో కొలువైన  సత్యనారాయణస్వామి ఆలయం కొండను అభివృద్ధి చేయడం కోసం రూ. 515కోట్లు అవసరమని ప్రతిపాదించారు. అక్కడ అతిథి గృహం, భక్తుల విడిది కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించడం, పచ్చదనం పెంపొందించడం, తాగునీరు, విద్యుత్తు తదితర వాటిని ఏర్పాటుచేయాలని భావించారు. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద అభివృధ్ధి పనులు చేపట్టేందుకు రూ.1775కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. సందర్శకుల కోసం విడిది గృహాలు, కాటేజీలు, రెస్టారెంటు, సెల్టర్లు, 600మీటర్ల రోప్‌వే నిర్మాణం, సమాచార కేంద్రం, తాగునీరు, విద్యుత్‌, పచ్చదనం పెంపొందించడం తదితర వాటిని చేపట్టాలని భావించారు.  ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌ చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చేందుకు రూ. 1600కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. స్థలాన్ని చదను చేయడం, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం స్నాక్స్‌బార్‌, సీసీ రహదార్ల నిర్మాణం, విడిది గృహాలు, కాటేజీలు, తాగునీరు, విద్యుత్తు, లైటింగ్‌ సిస్టమ్‌ తదితర వాటిని ఏర్పాటుచేయాలని భావించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయం వద్ద మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. 470 కోట్లు ప్రతిపాదనలు రూపొందించారు. దర్బార్‌ హాలు నిర్మాణంతో పాటు శాశ్వతంగా ఉండేందుకు స్టాళ్ల నిర్మాణం, సందర్శకుల షెడ్లు, నాలుగు కాటేజీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యంతో పాటు పచ్చదనం పెంపొందించడం తదితర వాటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.  బోథ్‌ మండలంలో పొచ్చెర జలపాతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం రూ.930కోట్లు ప్రతిపాదించారు. అక్కడ వసతిగృహాల కేంద్రం, రెస్టారెంటు, సమావేశమందిరం, విడిది గృహాలు, డార్మెటరీ, అనుసంధాన రోడ్లు, లైటింగ్‌ ఏర్పాటు తదితర వాటిని చేపట్టాలని భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో చారిత్రక కోటగా పిలవబడే గాంధారిఖిల్లాను అభివృధ్ధి చేసేందుకు రూ.435కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. కోటపైకి వెళ్లేందుకు మెట్లు నిర్మించడం, అక్కడి వరకు తాగునీటి వసతి కల్పించడం, పచ్చదనం పెంపొందించడం, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలని భావిస్తున్నారు.  నార్నూర్‌ మండలంలో జాలువారుతున్న పారాకప్పి జలపాతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.580 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. ఇక్కడ సందర్శకుల కోసం షెల్టర్ల నిర్మాణం, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా కాటేజీలు, జలపాతం వద్ద మరమ్మతులు తదితర వాటిని చేపట్టాలని నిర్ణయించారు.  నార్నూర్‌ మండలంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.95 కోట్లు అవసరమని భావించారు. ఇక్కడ కాటేజీలు, సమాచార కేంద్రం, షెల్టర్లు, సీసీరోడ్లు, తదితర వాటిని చేపట్టాలని భావించారు.  నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో కొలువైన కదిలి పాపహరేశ్వర ఆలయం వద్ద మౌలిక వసతుల కోసం రూ.370 కోట్లు అవసరమని భావించారు. ఇక్కడ షెల్టర్లు, సమాచార కేంద్రం, కాటేజీలు, గుండాలు, కోనేరుల అభివృద్ధి తదితర వాటిని చేపట్టాలని నిర్ణయించారు.