సంక్షోభంలో నేతన్న (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షోభంలో నేతన్న (కృష్ణాజిల్లా)

పెడన, జూన్ 3 (way2newstv.com): 
చేనేత పరిశ్రమ మరో సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ పరిశ్రమలో వినియోగించే రంగులు, రసాయనాల ధరలు కొద్ది నెలలుగా భారీగా పెరగడంతో పరిశ్రమపై ఆర్థిక భారం పడింది. ఫలితంగా వస్త్రాల గిట్టుబాటు ధరలు పెరిగి పరిశ్రమపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఏడాదికి రూ.20 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే చేనేతకు పెరిగిన ధరలు శాపంలా మారాయి. జిల్లాలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 5,310 కుటుంబాలు జీవిస్తున్నాయి. మొత్తం 11,912 మగ్గాల ద్వారా వస్త్రాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో సహకార రంగంలోని 38 సంఘాల పరిధిలో 7,047, ప్రైవేటు రంగంలో 4,865 మగ్గాలు ఉన్నాయి. చేనేత సంఘాల్లో పెడన నియోజకవర్గంలో అత్యధికంగా 23, చల్లపల్లి, మచిలీపట్నం, చిన్నాపురం, కాజ, ఘంటశాల, పెదగొన్నూరు, ముస్తాబాద తదితర ప్రాంతాల్లో మిగిలిన సంఘాలు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేటు రంగం కూడా పెడనలోనే ఎక్కువగా విస్తరించింది. ఆ తర్వాత రాయవరం, పెదగొన్నూరు ప్రాంతాల్లో కూడా ఉత్పత్తి జరుగుతోంది.చేనేత పరిశ్రమలో రంగులు, రసాయనాలను ప్రధానంగా వినియోగిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన నూలును వివిధ రంగుల్లోకి మార్చేందుకు అద్దకం (డైయింగ్‌) చేస్తారు. 

సంక్షోభంలో నేతన్న (కృష్ణాజిల్లా)
ఈ ప్రక్రియకు అవసరమైన రంగులు జిల్లాలో పెడనతో పాటు విజయవాడలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పెడనలో చిల్లర వర్తకం జరుగుతుండగా మచిలీపట్నంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌ ఉన్నారు. ప్రధానంగా అతుల్‌, ఇండోకెమ్‌ కంపెనీల ద్వారా చేనేత పరిశ్రమకు అవసరమైన రంగులు సరఫరా అవుతాయి. గుజరాత్‌ కేంద్రంగా ఉన్న అతుల్‌ కంపెనీ అత్యధికంగా వ్యాట్‌, నాఫ్తాల్‌ రంగులను సరఫరా చేస్తోంది. ఈ రెండు రంగులతో అద్దకం చేసిన వస్త్రాలు మన్నికగా ఉంటాయి. పొరుగు దేశమైన చైనా నుంచి ఈ రెండు కంపెనీలు 50 శాతం వరకు ముడి సరకులను భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తాయి. కాలుష్యం కారణంగా అక్కడ కొన్ని కంపెనీలను చైనా ప్రభుత్వం మూసివేయించటంతో భారతదేశంలో సంక్షోభం ఏర్పడింది. అక్కడ 36 కంపెనీలు ఉండగా అందులో 30 వరకు మూసివేశారు. మిగిలిన ఆరింటిలో అతి పెద్దదైన ఒక పరిశ్రమ ఇటీవల అగ్నిప్రమాదానికి గురికావడంతో ఇక్కడ ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా మారింది. ఇదే సమయంలో మన దేశంలో కూడా కాలుష్య ప్రమాణాలను పాటించని కొన్ని పరిశ్రమలను మూసివేయటంతో ధరలు అసాధారణంగా పెరిగాయి.పసుపు రంగు వచ్చే నోవాటిక్‌ ఎల్లో 5జీ అక్‌రా కాన్క్‌ పౌడర్‌ కిలో ధర గత ఏడాది ఏప్రిల్‌లో రూ.3,130 ఉంటే ఈ ఏడాది మే 1 నాటికి రూ.6,161కు పెరిగింది. నోవాటిక్‌ జాడే గ్రీన్‌ ఎక్స్‌బీఎన్‌ ఆక్రా పౌడర్‌ రూ.2,934 నుంచి రూ.3,990కు పెరిగింది. తులాబేస్‌ ఫాస్ట్‌ రెడ్‌బీ రూ.598 నుంచి రూ.1,373కు, తులాబేస్‌ బోర్డీఎక్స్‌ జీపీ రూ.540 నుంచి రూ.927కు పెరిగాయి. నోవాటిక్‌ బ్లూ ఆక్రాపౌడర్‌ రూ.2,466 నుంచి రూ.4,013కు పెరిగింది. నోవాటిక్‌ బ్రౌన్‌ ఆర్‌ రూ.3,491 నుంచి రూ.4,225కు పెరుగుదల కన్పించింది. ఆలీవ్‌ గ్రీన్‌ బీ రూ.2,369 నుంచి రూ.3,403కు తులాతాల్‌ రెడ్‌ ఏఎస్‌టీఆర్‌ రూ.986 నుంచి రూ.1,338కు పెరిగాయి.పెరిగిన ధరల ప్రభావం కలంకారీ పరిశ్రమపైనా కన్పిస్తోంది. కలంకారీ చీరలకు చివరి దశలో రంగులు అద్దుతారు. ఫలితంగా చీరలు, ఇతర వస్త్రాలు ఆకర్షణీయంగా కన్పిస్తాయి. కొన్నేళ్లుగా ఈ వస్త్రాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా కలంకారీ ఉత్పత్తిపై కూడా పెరిగిన ధరలు గణనీయ ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల కలంకారీ డైయర్లు సమావేశాన్ని నిర్వహించి ధరలపై ఆందోళన వెలిబుచ్చారు. తమకు వర్తకులు చెల్లించే ధరలు సరిపోవటం లేదని పెంపుదలకు ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.