రెంటికి చెడ్డ రేవడిలా సిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెంటికి చెడ్డ రేవడిలా సిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డి


ఒంగోలు, జూన్ 6, (way2newstv.com)
ఏపీలో తాజా ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు చాలా మందికి ఎన్నో నమ్మకాలు కలిగించారు. పార్టీ తరపున పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో చంద్రబాబు చాలా మందిని బ‌ల‌వంతంగా ఒప్పించి… మీకు తానున్నానంటూ నమ్మకాన్ని కలిగించి మరి వారిని బలవంతంగా ఎన్నికల బరిలోకి దింపారు. ఎన్నికల్లో వారు చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్న చందంగా ఇప్పుడు వారి పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక దిగాలు చెందుతున్నారు. ఇలాంటి వారిలో తాజా మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, శిద్ధా రాఘవరావు ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరిని బాబు బలవంతంగా లోక్ సభకు పోటీ చేయించారు. ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీగా పోటీ చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కోసం చంద్రబాబు ఆదిని ఎంపీగా పంపారు.ఎన్నిక‌ల్లో ఆది ఘోరాతి ఘోరంగా ఏకంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ప‌రువు పోగొట్టుకున్నారు. 


రెంటికి చెడ్డ రేవడిలా సిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డి
ఈ ఎన్నికల్లో ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు పెద్ద డైలమాలో పడింది. ఇక ప్రకాశం జిల్లా నుంచి బాబు కేబినెట్‌లో ఉన్న శిద్ధా రాఘవరావు పరిస్థితి కూడా అంతే అగమ్యగోచరంగా ఉంది. 2014 ఎన్నికల్లో దర్శి నుంచి విజయం సాధించిన సిద్దాకు చంద్రబాబు వైశ్య సామాజిక వర్గాల కోటాలో మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్లపాటు మంత్రిగా తనదైన ముద్ర వేసిన ఆయన దర్శి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి దర్శి నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆయన దర్శి లో వర్క్ చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు శిద్దాపై బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఆయనకు ఇష్టం లేకపోయినా ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు.ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఏకంగా 2 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఓ రకంగా ఇది ఘోరపరాజయం లాంటిదే. ఎన్నిక‌ల ప్రచారంలో చంద్రబాబు మాగుంట పారిపోయాడు… శిద్ధా పులి లాంటి వాడ‌ని చెప్పినా ఒంగోలు జ‌నాలు వైసీపీ సునామీలో శిద్ధాకు ఓట్లేయ‌లేదు. అదే సిద్ధ దర్శి నుంచి పోటీ చేస్తే వైసిపి సునామీలో ఓడిపోయినా మరీ అంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్న విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. దర్శి నుంచి అప్పటివరకు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబురావుని తీసుకువచ్చి పోటీ చేయించడంతో స్థానిక టీడీపీ శ్రేణులు ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేదు. దీంతో దర్శిలో వైసిపి ఏకంగా 35 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది.అదే శిద్ధా అక్కడి నుంచి పోటీ చేసి ఉన్నట్లయితే అంత ఘోరంగా ఓడిపోయి ఉండేవారు కాదని ప్రకాశం జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇక ఎంపీగా పోటీ చేసిన శిద్ధా ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన వర్క్ చేసుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గం అంటూ ఆయన చేతుల్లో లేకుండా పోయింది. ఆయ‌న ఓడిపోవడంతో చేయడానికి ఏమీ లేదు. అటు ఆర్థికంగానూ సిద్ధా బాగా నష్టపోయారు. చంద్రబాబును, జిల్లాలో టిడిపి అభ్యర్థులను నమ్ముకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది.