భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడే గేమ్ లో భాగంగా తెలుగుదేశం తోపాటు జనసేననూ టార్గెట్ చేస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మెగాస్గార్ నే తీసేసుకుంటే సరిపోతుందనే కొత్త ప్లాన్ వేస్తోంది. అటు టీడీపీలో పెద్ద నాయకులకు వల వేస్తోంది. ఇటు చిరంజీవి వస్తే జనసేన తనంతతానే బలహీనపడిపోతుందని అంచనా వేస్తోంది. ఫలితంగా వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ రూపుదాలుస్తుందని లెక్కలు వేసుకుంటోంది. జనసేన ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ శ్రేణులన్నీ డీలాపడిపోయి ఉన్నాయి. ఈ సమయంలో కమలం పార్టీ చిరంజీవిని ఆకర్షిస్తే మెగా అభిమానులు లక్షల్లోనే చేరతారని ఆశిస్తోంది. ఇంకోవైపు చూస్తే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. క్యాడర్ కు నైతిక స్థైర్యం చెప్పేవారు కరవు అయ్యారు. వైసీపీ దాడిని తట్టుకోవడం చాలా కష్టమనే అంచనాకు వస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులు సహా పార్టీ మార్చేస్తే అధికారపార్టీ తమ జోలికి రావడానికి సాహసించకపోవచ్చని భావిస్తున్నారు. అందుకు తగిన భరోసాను బీజేపీ నాయకులు అందిస్తున్నారు.
జనసేనను టార్గెట్ చేసిన బీజేపీ
తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకున్నప్పట్నుంచి ఏపీలో బలపడేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ తో అమిత్ షా చర్చలు జరిపారు. తన ప్రాంత ప్రయోజనాల ద్రుష్ట్యా జాతీయ పార్టీ తన ఒంటికి పడదని పవన్ తేల్చి చెప్పేశారు. చిరంజీవికి జాతీయపార్టీల విషయంలో అటువంటి అభ్యంతరాలేమీ లేవు. ఎటూ కాంగ్రెసు పార్టీ దెబ్బతిని ఉంది కాబట్టి చిరంజీవిని అక్కడినుంచే నేరుగా కమలంలో చేర్చుకోవచ్చుననుకుంటున్నారు. చిరంజీవి తిరిగి సినీ కెరియర్ ను ప్రారంభించినప్పటికీ అది దీర్ఘకాలం సాగే ఇన్నింగ్స్ కాదు. అందుకే మెగాస్టార్ ను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ మెగాస్టార్ కమలం తీర్థం స్వీకరిస్తే జనసేనకు చిక్కులు తప్పవు. పవన్ ఒంటరి పోరునే నమ్ముకుంటున్నాడు. చిరు నిర్ణయంతో ఎలాగూ విభేదిస్తాడు. జనసేనలో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. అధికారం వస్తుందని నమ్మకం కుదిరితే అభిమానులు చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉంది.చిరంజీవికి జనాకర్షణ ఉన్నప్పటికీ సమర్థమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. 70 లక్షల పైచిలుకు ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోలేకపోయాడు. పార్టీని నడిపే సామర్థ్యం అంతంతమాత్రమే. అదే పవన్ కల్యాణ్ లో పోరాట తత్వం ఎక్కువ. అది నాయకత్వ లక్షణం. అందుకే చిరంజీవిని పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఇవ్వరు. కేంద్రస్థాయి పదవిని అప్పగిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం ఎటూ కేంద్రమంత్రివర్గంలో స్థానం లేదు. ఏదో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపి కేంద్రంలో పదవి ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు. చిరంజీవికి మధ్యవర్తుల ద్వారా ఈ ఆఫర్ ను తెలియచేశారు. పిలిచి పదవి ఇస్తుంటే కాదనలేని పరిస్థితి. కానీ ఫ్యామిలీ సెంటిమెంటు అడ్డు వస్తోంది. సోదరుడు పవన్ సీరియస్ గా జనసేనను నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు తాను బీజేపీలోకి వెళితే అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు మెగాస్టార్. ‘సైరా’ చిత్రం విడుదల తర్వాత రాజకీయంగా ఈవిషయంలో స్పష్టత రావచ్చనుకుంటున్నారు.రాజకీయం వడ్డించిన విస్తరి కాదు. పంట మొదలు వంట వరకూ మనమే చేసుకోవాలి. ఏదో కొందరు వారసులకు తప్ప గోల్డెన్ స్పూన్ తో అధికారం దక్కదు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అధికారంలోకి రావడానికి జగన్ మోహన్ రెడ్డి ఎంతపోరాటం చేయాల్సి వచ్చిందో, ప్రజాక్షేత్రంలో ఎంతగా తిరగాల్సి వచ్చిందో ఇటీవలి అనుభవమే. తాజా ఎన్నికల్లో బాగా అప్ సెట్ అయిన పార్టీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన. పార్టీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించేందుకు జనసేనాని ప్రయత్నాలు మొదలు పెట్టారు. సమీక్షలు జరుపుతూ కమిటీలు నియమిస్తున్నారు. అయితే పవన్ పై పార్టు టైమ్ పొలిటీషియన్ అనే ముద్ర బలంగా ఉంది. ఒక వారం రోజుల పాటు హడావిడి చేసిన తర్వాత మరొక వారం రెస్టు తీసుకుంటారని చెబుతుంటారు. పార్టీ ప్రచార విషయంలోనూ ఇదే జరిగింది. రెండేళ్లుగా జనసేన ఎన్నికలకు సన్నద్ధమైంది. కానీ కంటిన్యూగా ప్రజల్లో తిరుగుతూ ప్రచారాన్ని పవన్ కొనసాగించలేకపోయారు. పార్టీ ఘోర పరాజయానికి అది కూడా ఒక ప్రధాన కారణంగానే చెప్పాలిపార్టీ నిర్వహణ భారీ వ్యయంతో కూడిన వ్యవహారం. కోట్లు కుమ్మరించాల్సి వస్తుంది. నాయకుల పర్యటనలు మొదలు ప్రచారం వరకూ నిరంతరం నిధులు అవసరపడతాయి. మరో అయిదేళ్ల వరకూ ఎటువంటి పెద్ద పదవులు లభించని పార్టీకి విరాళాలు ఇచ్చి పోషించే వారెవరనే ప్రశ్న తలెత్తుతుంది. ఎంతోకొంత డబ్బులు ఖర్చు పెట్టగలిగినవారు మొన్న ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక వారి నుంచి ఆశించేదేమీ ఉండదు. అందుకే కొత్తగా నిధుల సమీకరణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతవరకూ సొంత నిధులను పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సినిమాలు చేయనని తెగేసి చెప్పేశాడు. అందువల్ల ఆదాయవనరులు అడుగంటిపోయినట్లే. ప్రత్యామ్నాయ ఆదాయంపై తాజాగా ద్రుష్టి సారిస్తున్నాడు. నిర్మాతగా పవన్ కొత్త అవతారం ఎత్తుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తద్వారా సమకూరే నిధులను పార్టీకి వినియోగిస్తారంటున్నారు. ఏదేమైనప్పటికీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలనే తాపత్రయం మాత్రం పవన్ కల్యాణ్ లో కనిపిస్తోంది. అదొక్కటే ప్రస్తుతానికి ఆపార్టీకి బలం.