నేతలకు, క్యాడర్ లకు ధైర్యం పోసే పనిలో చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతలకు, క్యాడర్ లకు ధైర్యం పోసే పనిలో చంద్రబాబు


విజయవాడ, జూన్ 8, (way2newstv.com)
మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటున్న తెలుగుదేశంపార్టీకి చంద్రబాబునాయుడు పెద్ద దిక్కు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడు సంక్షోభ సమయంలోనూ నిబ్బరంగా ఉండి పార్టీని, క్యాడర్ ను చక్కదిద్దే నైపుణ్యం పుష్కలంగా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో దెబ్బతినింది. తెలంగాణలో పార్టీ పూర్తిగా భూస్థాపితం అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. చంద్రబాబునాయుడు ఇప్పుడిప్పుడే నేతలకు, క్యాడర్ కు ధైర్యం నూరి పోస్తున్నారు. పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.2024 ఎన్నికలకు సమాయత్తం క్యాడర్ ను సమాయత్తం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత పుంజుకుంటే నాయకుల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే వారంలో ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ లోనూ, రెండు రోజుల పాటు తెలంగాణాలోనూ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా చంద్రబాబు క్యాలెండర్ రూపొందించుకున్నారు. 


నేతలకు, క్యాడర్ లకు ధైర్యం పోసే పనిలో చంద్రబాబు
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత విజయాన్ని సాధించుకోగలిగితే ఐదేళ్ల పాటు పార్టీ నేతలు, క్యాడర్ తమతో ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు.ఇప్పుడు పార్టీలో మాజీ మంత్రి, చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ నాయకత్వంపైనే చర్చ జరుగుతోంది. లోకేష్ ఇప్పటకే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు లోకేష్ కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్నది అందరికీ తెలిసిందే. లోకేష్ లో సమర్థ నాయకత్వ లక్షణాలేవీ లేవన్నది ఆ పార్టీనేతల నుంచి విన్పిస్తున్న మాట. నాయకత్వ లక్షణాలు లేమితో పాటు వ్యూహాలను కూడా లోకేష్ సక్రమంగా అమలు చేయలేరని, సరైన నిర్ణయం తీసుకోలేరన్నది ఎక్కువమంది సీనియర్ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతటి ముందు చూపే ఉంటే లోకేష్ మంగళగిరి లో ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీకి దిగరని ఒక సీనియర్ నేత ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఒక పార్టీని నడపాల్సిన వ్యక్తి అరంగేట్రంలోనే అపజయాన్ని మూటగట్టుకుంటే క్యాడర్ ఎలా విశ్వసిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండబోతుండటంతో లోకేష్ రాజకీయంగా నలుగుతారని, చంద్రబాబు సారథ్యంలోనే ఈ ఐదేళ్లు పార్టీ ఉంటున్నప్పటికీ భవిష్యత్తుపైనే టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరి నారా లోకేష్ ఈ ఐదేళ్లలో తానేంటో నిరూపించుకో గలుగుతేనే ఆయన నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి ఉంటుంది. లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను నేతలు ఎంచుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.