మితిమీరుతున్న ఎరువులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మితిమీరుతున్న ఎరువులు


చౌడు భూములుగా పంటపొలాలు
నిజామాబాద్, జూన్ 26, (way2newstv.com)
పంటలకు అవసరానికి మించి ఎరువులు వాడితే అనర్థమే. భూమిలో పోషక పదార్థాలను గుర్తించి పంటలకు అనుగుణంగా రసాయన ఎరువులు వాడాలి. రైతులు జాగ్రత్తలు తీసుకోకుంటే, పంట దిగుబడి తగ్గుతుంది. అంటూ ఎరువుల వాడకంపై వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. నేల స్వభావాన్ని బట్టి వివిధ పంటలకు కావాల్సిన రసాయన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సమస్యాత్మక నేలల్లో వివిధ పంటలు సాగు చేసేటప్పుడు ఆమ్ల భూములైతే సున్నం, క్షారభూములైతే జిప్సం భూసార పరీక్షలను అనుసరించి ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చౌడు భూముల్లో చౌడు స్థాయిని బట్టి జిప్సం వేయాలి. పరోక్షంగా ఎరువుల వినియోగం సామర్థ్యం పెరిగి వివిధ సూక్ష్మ పోషకాలు మొక్కలను అందుబాటులోకి వస్తాయి. నేలలో బంకమట్టి రేణువులు స్వభావాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని ఎరువులను ఎన్ని దఫాలుగా వేయాలో ఆధారపడి ఉంటుంది. ఇసుక నేలల్లో ఎక్కువ దఫాలుగాను, బరువు నేలల్లో 2.3 సార్లు నీటిని తీసి బురదలో ఎరువులను వేస్తే నత్రజని ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది. తేలిక నేలల్లో అయితే సేంద్రీయ, రసాయన ఎరువులు 40, 60 నిష్పత్తితోను, సారం ఎక్కువ ఉన్న నేలల్లో అయితే 30 నుంచి 70 నిష్పత్తిలోను వేయడంతో సమతుల్యత పాటించాలి. 

మితిమీరుతున్న ఎరువులు 


రసాయన ఎరువులతోపాటు సేంద్రీయ ఎరువులు కలిపి వేయడం వలన వినియోగం సామర్థ్యం పెరుగుతుంది. వివిధ సూక్ష్మపోషకాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. వివిధ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కంపోస్టుగా మార్చి ఉపయోగించినప్పుడు యూరియా వంటి సూటి ఎరువుల సామర్థ్యం నత్రజని లభ్యత పెరుగుతుంది. ఎరువుల వినియోగానికి సరైన పద్ధతిలో మెరుగైన నీటి యాజమాన్యం తప్పని సరిగా పాటించాలి. యూరియా, మిగత రసాయన ఎరువులు వేసినప్పుడు వేపపిండితో గాని లేదా వేపనూనెతో కలిపి గాని కలిపి చల్లితే ఎరువులు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా 24 గంటల తరువాత నీరు పెట్టాలి. యూరియా వేపపిండితో కలిపి చల్లుతూ వృథా అయ్యేశాతం తగ్గి నత్రజని పంటకు నిధానంగా అందుతుంది. తారు 500 గ్రాములు, కిరోసిన్‌ ఒక లీటరు, యూరియా 50 కిలోలు కలిపి చల్లాలి. దీనికి 15 కిలోల వేపపిండి కలిపి నీడలో ఆరబెట్టి 24 గంటల తరువాత పంటకు వేయాలి. దీని వల్ల యూరియా వేయవలసిన మోతాదు 25 శాతం వరకు తగ్గించి పూర్తి ఫలితం పొందవచ్చు. వరి పొలాల్లో అయితే నీరు లేని పరిస్థితుల్లో లేదా నీరు తీయలేని పరిస్థితుల్లో మెట్ట ఆరుతడి పంటలో తగినంత తేమలేనప్పుడు యూరియా రెండు శాతం పిచికారి చేసి నత్రజని అందించవచ్చు. అధిక సాంద్రత మొక్కలు నాటడం వలన వివిధ మొక్కల మధ్య పోషక పదార్థాల కోసం పోటీ, నీటి కోసం పోటీ పెరగడమే కాకుండా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. విత్తేపంట రకాన్ని బట్టి మొక్కల మధ్య దూరం సిఫారసు మేరకు పాటించాలి. సరైన సమయంలో విత్తుకోవడం వలన ఎరువుల వినియోగ శక్తితో పాటు దిగుబడులు పెరుగుతాయి. ఎరువులను వేసే ముందు తప్పనిసరిగా కలుపు మొక్కలు తీసివేయాలి. దీనివలన వేసిన రసాయన ఎరువులు మొక్కలు సమర్థ్ధవంతంగా వినియోగించుకోగలుగుతాయి. వివిధ పంటలకు సిఫారసు చేసిన సమయం వరకు కలుపు మొక్కలను తీసిన తర్వాత దూరంగా తీసికెళ్లి కాల్చివేడయం ఉత్తమం. దీనిని అవసరాన్ని బట్టి గోతుల్లో వేసి కంపోస్టు ప్రక్రియ ద్వారా సేంద్రీయ ఎరువుగా మార్చుకోవచ్చు.