మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కొత్త సచివాలయ భూమిపూజకు హాజరయ్యారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు సమాచారం. బావా.. మళ్లీ కుదరదేమో.. ఒక సారి మన పాత చాంబర్లు చూసుకుందామా అని హరీశ్‌తో కేటీఆర్ అన్నట్టు తెలుస్తోంది. దీనికి హరీశ్ చిరునవ్వులు చిందించారని చెబుతున్నారు. ఆ తర్వాత ఇరువురూ కాసేపు కార్యకర్తలతో సెల్ఫీలు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బావా..మళ్లీ కుదురదేమో...!
ఇదిలా ఉంటే హరీశ్ రావు పార్టీకి దూరమవుతున్నారంటూ గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. మంత్రిపదవి దక్కక పోవడం, తాజాగా ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన కనబడకపోవడం లాంటి అంశాలపై చర్చోపరచ్చలు జరిగాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చెడిందని ఒకరంటే.. సొంత పార్టీ పెట్టుకోనున్నారని మరొకరు.. ఇలా రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా సచివాలయ భూమిపూజకు హరీశ్ రాకతో వాటన్నింటికీ చెక్ పెట్టినట్టైందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేటీఆర్, హరీశ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరితో కలివిడిగా తిరగడం కూడా వారి మాటలకు మరింత బలాన్నిస్తున్నాయి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, హరీశ్‌లకు చోటు దక్కనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరినీ మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం.