జూన్ నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూన్ నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు


హైద్రాబాద్, జూన్ 14  (way2newstv.com)
తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌ కార్డులు త్వరలోనే రానున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ ఉండటంతో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. పరిషత్‌ ఎన్నికలు కూడా ముగియడంతో ఎన్నికల కోడ్‌ తొలిగిపోయింది. దీంతో జూన్, 2019 నుంచి కొత్త కార్డులు  ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితోపాటు ఇదివరకు అప్లై  చేసుకున్న వారికి కూడా కార్డులు ఇవ్వనున్నారు.రేషన్‌కార్డుల జారీలో గతంలో మాదిరిగా అలసత్వం లేకుండా స్పష్టమైన ఆదేశాలను అధికారులు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారికి చాలా మందికి కార్డులు అందక ఎదురు చూస్తున్నారు. దీంతో కార్డుల మంజూరును వేగంగా జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో లక్ష వరకు దరఖాస్తులు ఉన్నాయని... మరో రెండు లక్షల వరకు ఈసారి దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేషన్‌కార్డుతో అనుసంధానిస్తున్నారు. 


జూన్ నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
దీంతో రేషన్‌కార్డు కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రేషన్‌ కార్డు ఉన్నా లేకున్నా సంక్షేమ పథకాలు అందుతాయని గతంలో ప్రభుత్వం ప్రకటించినా .. ఆచరణలో అది సాధ్యంకాదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఏ ఊళ్లో రేషన్‌కార్డు ఉంటే.. అక్కడే సరుకులు తీసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ గత ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన బయోమెట్రిక్‌ విధానంతో ఆ బాధ తప్పింది. దీంతో రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఉపాధి నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు సైతం... రేషన్‌ సరుకుల కోసం సొంత గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పోర్టబిలిటీ కారణంగా నగరంలోనే రేషన్‌ సరుకులు తీసుకునే సౌలభ్యము ఏర్పడింది.రేషన్‌కార్డులు పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. నివాసానికి సంబంధించి ప్రూఫ్‌, ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జతచేసి మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చేసిన దరఖాస్తును తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలించి విచారణ జరిపిన అనంతరం రేషన్‌కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కొత్త కార్డులతోపాటు... గతంలో పొందిన కార్డుల్లో దొర్లిన తప్పులను కూడా సరిచేయనున్నారు