డిప్యూటీ స్పీకర్ కు జగన్ పార్టీ దూరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిప్యూటీ స్పీకర్ కు జగన్ పార్టీ దూరం


న్యూఢిల్లీ, జూన్ 24, (way2newstv.com)
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీకి దక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.అయితే, బీజేపీ ఇస్తున్న ఆఫర్‌ను వైసీపీ తిరస్కరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏపీకి ప్రత్యేక హోదానే అందుకు కారణం. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల ఎన్డీయేతో అంటకాగినట్టు అవుతుందని, అందుకే ఈ ఆఫర్‌‌‌ను వైసీపీ తీసుకోవడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత చెప్పినట్టు పీటీఐ తెలిపింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 


డిప్యూటీ స్పీకర్ కు జగన్ పార్టీ దూరం
ఆ పార్టీ తరఫున 22 మంది ఎంపీలు విజయం సాధించారు. లోక్‌సభలో అతిపెద్ద నాలుగో పార్టీగా వైసీపీ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార ఎన్డీయేకి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి సమాన దూరం పాటించాలని వైసీపీ నిర్ణయించుకుంది. అయితే, అంశాల వారీగా అధికార పార్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంది.లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా తమకు ఎలాంటి పిలుపు రాలేదని వైసీపీ నేత చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రత్యేక హోదా ఇస్తేనే తాము డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకుంటామని ఆ నేత స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము బీజేపీ పెద్దల చెవిన వేసినట్టు తెలిపారు. పైగా డిప్యూటీ స్పీకర్ పదవి.. అలంకారం కోసమే కానీ, పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే, స్పెషల్ స్టేటస్ కోసం తాము కేంద్రంలోని పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ నేత చెప్పారుః