ఇష్టానుసారంగా ఫీజులు... భరించలేకపోతున్న పేరంట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇష్టానుసారంగా ఫీజులు... భరించలేకపోతున్న పేరంట్స్


నెల్లూరు, జూన్ 25, (way2newstv.com)
వేసవి సెలవులు పూర్తి అయి పాఠశాలలు తెరుచుకుని దాదాపు పది రోజులు దాటుతోంది. ఎండల వేడిమికి ఒంటిపూట బడులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ప్రవేట్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం ఎండవేడిమితోపాటు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రయివేట్‌ పాఠశాలల మోజులో విద్యార్థుల తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నా రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.ప్రయివేట్‌ పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నాయి. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడం లేదు. ఇరుకు గదుల్లో విద్యార్థులకు అనుభవం లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కాంపౌడ్‌ వాల్స్‌, ఆడుకొనేందుకు ఆటస్థలాలు లేవు. కనీస వసతులు లేకపోయినా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అధిక పీజులను వసూలు చేస్తున్నాయి. 

ఇష్టానుసారంగా ఫీజులు... భరించలేకపోతున్న పేరంట్స్

విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. ఫీజుల పెంపుదలకు ఎలాంటి కమిటీలను నియమించలేదు. ఇష్టానుసారంగా యాజమాన్యాలే పెంచుతున్నా విద్యాశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే కలిగే ప్రయోజనాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అసలే పంటలు పండక, పండిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ప్రయివేట్‌ పాఠశాలల్లో పిల్లలకు ఫీజులు చెల్లించలేక అప్పులు చేసి కడుతున్న పరిస్థితి నెలకొంది. 59 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు, ఒక కస్తూరిబా పాఠశాల, ఒక మోడల్‌ స్కూల్‌ ఉంది. ప్రయివేటు పాఠశాలలు 15 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 10,115 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో 5,230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో ఏటేటా పెరుగుతున్న ఫీజులతో పాటు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూ తదితర వాటి ధరలు భారంగా మారుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, షూలు అన్నీ ఉచితంగా అందజేస్తున్నారు. కొందరు దాతలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పలకలు, పెన్నులు, నోటు పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో పోషకాహార సమతుల్యం కోసం ఒక్కొక్క వారంలో మెనూ టైంటేబుల్‌ ప్రకారం 5 రోజులు ఉడకబెట్టిన గుడ్డును మధ్యాహ్న బోజనంలో ఇస్తున్నారు. ప్రభుత్వం బాలికలకు సైకిళ్ళను ఉచితంగా అందిస్తుంది. గత సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియంను ప్రారంభించారు. కానీ కేవలం ప్రయివేట్‌ విద్యపై మోజుతో ఎంతో మంది పేదలు సైతం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపకుండా కూలీనాలి చేసి కష్టపడిన సోమ్ముతో ప్రయివేట్‌కు పంపుతూ ఏటా వేల రూపాయల్లో దోపిడీకి గురవుతున్నారు. ఈ సంవత్సరం ప్రయివేట్‌ పాఠశాలల్లో ఫీజులు పెంచారు. అదనంగా డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనాల మెయింటెనెన్సు కోసం బస్‌ ఫీజులు కూడా పెంచారు. అలాగే ఆడ్మిషన్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తరగతిని బట్టి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు గుంజుతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూ వంటి వాటిని తమ వద్దనే కొనాలని నిబంధనలు విధిస్తున్నారు. ఎల్‌కేజి విద్యార్థుల నుంచి పుస్తకాల ఫీజు, పరీక్ష ఫీజులంటూ రూ.800 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. జూన్‌ నెలలో పాఠశాలల ప్రారంభం కావడంతో బయట మార్కెట్‌లో కూడా నోట్‌బుక్స్‌, బ్యాగులు, పెన్నులు, పెన్సిల్లు, షూ తదితర సామాగ్రిపై ధరలు అమాంతంగా పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలేత్తిపోతున్నారు. ఒక నోటు పుస్తకం ధర రూ.5 నుంచి రూ 10 వరకు ఈ ఏడాది పెరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతుంది.