వారంతా రాజకీయ ఉద్ధండులు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ చక్రం తిప్పిన నాయకులు. ఎదురులేని ప్రజాభిమానాన్ని ఒకనాడు సొంతం చేసుకున్నారు. తిరుగులేని విధంగా రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం పొలిటికల్ సన్యాసం దిశగా అడుగులు వేస్తున్నారు. వారే సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, రాయపాటి సాంబశివరావు, అయ్యన్నగారి సాయి ప్రతాప్. వివాద రహితులుగా ముద్ర వేసుకోవడం, ప్రజల పక్షాన నిలబడడం, సమస్యలపై పోరాడడం, సొంత నిధులు ఖర్చు చేసి మరీ అభివృద్ధి చేపట్టడం వంటివి వీరి లక్షణాలు. అయితే, అన్ని రోజులు ఒకేలా ఉండనట్టుగా రాజకీయాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. యువత ప్రవేశం, రాజకీయాల్లో మార్పులు ఈ నలుగురి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
ఆ నలుగురు ఇక రాజకీయ సన్యాసమే
కొణతాల రామకృష్ణ రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. కాంగ్రెస్‌లో ఆయన జోరుగానే రాజకీయాలు చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. వివాద రహితుడిగా ముద్ర వేసుకున్నారు. అవినీతి మకిలి అంటని నాయకుడిగా కూడా గుర్తింపు సాధించారు. అయితే, తాజా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయన దూరమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు కొణతాలకు టీడీపీ, వైసీపీ రెండు పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేయమన్న ఆఫర్ వచ్చింది. అయితే ఎటు వెళ్లాలో తెలియని డైలమాలో ఉన్న ఆయన రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారు.ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్‌ను కలిసి ఆయన కండువా కప్పుతున్నా కూడా తిరస్కరించి వెంటనే వెళ్లిపోయారు. కొణతాల నాడు జగన్ సమక్షంలో పార్టీలో చేరి ఉంటే ఈ రోజు ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీటు ఆయనదే అయ్యేది… ఆయన గెలిచి ఉండేవారు.ఇక సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు. గుంటూరు కేంద్రంగా అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను చక్రం తిప్పిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఒకనాడు నిత్యం 500 మందికి రాయపాటి ఇంట్లో భోజన పెట్టిన పరిస్తితి ఉంది. అయితే, వయో వృద్ధుడు కావడంతోను, భార్యావియోగంతోను బాధపడుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌తో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం చివరకు టీడీపీతో ముగిసింది. రాయపాటి రాష్ట్ర విభజన నిరసిస్తూ పార్టీ మారి టీడీపీ తరఫున 2014లో ఎంపీ అయ్యారు. తాజా ఎన్నికల్లోఓటమితో ఆయన కూడా దాదాపు దూరమైన పరిస్థితి నెలకొంది. రాజకీయంగా తనకంటే చాలా జూనియర్ కూడా కాదు.. ఓనమాలు కూడా తెలియని లావు శ్రీకృష్ణదేవరాయులు చేతుల్లో ఓడిపోయారు.ఇక, సబ్బం హరి. ఉత్తరాంధ్ర నుంచి కాంగ్రెస్‌లో కీలక చక్రం తిప్పిన నాయకుడిగా సబ్బం పేరు తెచ్చుకున్నారు. మేధావిగా, విశ్లేషకుడిగా కూడా పేరుంది. అయితే, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్‌కు దూరమై.. 2014లో ఎన్నికలకు కూడా దూరంగానే ఉండిపోయారు. తాజా ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమిలిలో పోటీ చేసిన సబ్బం.. ఓడిపోయారు ఇక, ఈయన కూడా రాజకీయాలకు దాదాపు స్వస్థి చెప్పినట్టుగానే భావించాలి. నాలుగో నేత అయ్యన్నగారి సాయిప్రతాప్.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులుగా ముద్ర పడి… వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కీలక నేత. కడప జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించిన సాయిప్రతాప్‌కు పారిశ్రామిక వేత్తగా మంచి గుర్తిపు తెచ్చుకున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో ఆయనవైసీపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో దూరమయ్యారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి ఈయన కూడా రాజకీయాలకు దూరమయ్యే అవకావం ఖచ్చితంగా కనిపిస్తోంది. వెరసి రాష్ట్రంలో నలుగురు యోధులు రాజకీయ సన్యాసం దిశగా అడుగులు వేస్తున్నారనడంలో సందేహం లేదు.