విద్యా సంస్థలల్లో ప్రతీదీ భారమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యా సంస్థలల్లో ప్రతీదీ భారమే


శ్రీకాకుళం, జూన్ 17, (way2newstv.com)
ప్రయివేట్‌ విద్యాసంస్థల యాజమాన్యానికి ప్రభుత్వం తలొగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు.ఇక తరగతి పెరుగుతున్న కొద్దీ అడ్మిషన్‌ ఫీజుతో పాటు నెలవారీ ఫీజు కూడా అదే రూపంలో పెంచుకుపోతున్నారు. విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడంతో తిన్నా తినకపోయినా పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ప్రత్యేక బడ్జెట్‌ను వేసుకోవాల్సిన పరిస్థితి మధ్యతరగతి కుటుంబానికి కూడా కల్పించారు. ఇలా ప్రతి విద్యార్థి నుండి కనీసం రూ.25 వేలు నుండి లక్ష రూపాయల వరకూ ఏడాదికి వసూలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు యథేచ్చగా కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గుర్తింపు ఉన్నా, లేకపోయినా విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారిన విధానంపై ఎన్నడూ దృష్టిసారించిన దాఖలాలు లేవు.  ఓపెన్‌ మార్కెట్‌లో లభించే పుస్తకాలు కూడా తమ వద్దే తీసుకోవాలంటూ నిబంధనలు విధించి బలవంతంగా విక్రయాలు చేస్తున్నారు. 


విద్యా సంస్థలల్లో ప్రతీదీ భారమే
ప్రతి సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు నోట్‌ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, జామండ్రి బాక్స్‌లు, యూనిఫాం, టై, బెల్టు, ఐడెంటి కార్డు, లోగోలను కొనిపిస్తున్నారు. అదేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యాసంస్థలు 400 పైబడి ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి విద్యాసంస్థలో పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్నాయి. పాఠశాల పున:ప్రారంభానికి ముందే విద్యార్థుల నుంచి పుస్తకాల కొనుగోలు చేయిస్తున్నారు. పుస్తకాలు కొనుగోలు చేయకపోతే కుదరదంటూ బదులివ్వడంతో చేసేది లేక అధిక ధరకైనా అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ఈ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయాలంటే రూ.2500తో కొనుగోలు చేయాల్సి ఉంది. ఐదో తరగతి విద్యార్థులకు సంబంధించి రూ.3 వేలు, అవిగాక ఒకటో తరగతి విద్యార్థికి కంప్యూటర్‌ విద్య పేరుతో రూ.1000 ఫీజు, టై, బెల్టు, టీ షర్టు ఇలా ప్రతి వస్తువును వ్యాపార దృక్పథంతో అంటగడుతూ జేబులకు చిల్లు పెడుతున్నారు. పాఠశాలల్లో చేరిన వెంటనే పుస్తకాల కిట్‌తో పాటు వీటికి సంబంధించి బిల్లు చేతిలో పెడుతున్నారు. అంతేగాక పరీక్షకు సంబంధించిన పేపర్లు, మధ్యమధ్యలో నోట్‌బుక్స్‌ కోసం మరో రూ.500 నుండి రూ.1000 వరకు కట్టించుకుంటున్నారు. ఇంతటితో అయిపోయిందని అనుకుంటే పొరపాటే. అడ్మిషన్‌ ఫీజులంటూ నర్సరీ విద్యార్థికి రూ.1500 నుండి వసూలు మొదలుపెట్టారు. అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఆ విద్యాలయాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందా లేదా, కనీస సౌకర్యాలు ఏర్పాటుచేశారా, ఆటస్థలం ఉందా, విద్యార్థుల నుంచి ఫీజులు, పుస్తకాలు, ఇతర అవసరాలకు ఎంత వసూలు చేస్తున్నారు వంటి వాటిపై ఎలాంటి అజమాయిషీ లేదు. విద్య ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరముంది. ఉచితంగా బోధించాల్సిన విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.